ఎయిర్​పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి : జీఎం అరుణ్​కుమార్​ జైన్

ఎయిర్​పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి : జీఎం అరుణ్​కుమార్​ జైన్
  • దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​ జైన్

గోదావరిఖని, వెలుగు :  దేశంలో ఎయిర్​పోర్టుల తరహాలోనే రైల్వే స్టేషన్లను డెవలప్ చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ ​మేనేజర్​ అరుణ్​ కుమార్ ​జైన్​తెలిపారు. శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్​ను సందర్శించి పనులను పరిశీలించారు. రైల్వే జీఎం మాట్లాడుతూ ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

కేంద్రం అమలు చేసే అమృత్​ భారత్​ స్కీమ్​లో భాగంగా రామగుండం రైల్వే స్టేషన్​ను రూ.26.50 కోట్లతో ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే  ప్రారంభించనున్నట్టు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 40  రైల్వేస్టేషన్లను మోడ్రన్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. 

రైల్వే జీఎం రైలుకు తప్పిన ప్రమాదం

కాజీపేట: సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంతో పాటు ఇతర ఉన్నతాధికారులు వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ కు ప్రత్యేక రైలులో వెళ్తుండగా ప్రమాదం తప్పింది. వరంగల్ రైల్వే స్టేషన్ దాటాక  పట్టాలపై ఇనుప పట్టా ముక్క ఉంది. చిన్నది కావడంతో  రైలు రాగానే పక్కకు పడిపోయింది. దీంతో ఎలాంటి ప్రమాదం లేకుండా స్పెషల్ రైలు కాజీపేటకు చేరుకుంది. 

స్పీడ్ గా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు  

 కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు స్పీడ్ గా కొనసాగుతున్నాయని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కాజీపేట జంక్షన్ లోని క్రూ కంట్రోల్ రూమ్ లో రైల్వే భద్రతపై లోకో డ్రైవర్లతో జరిగిన ముఖాముఖి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ హాజరై మాట్లాడారు. రైల్వే ప్రమాదాలు,  డ్రైవర్ల ఆరోగ్యం, రక్షణ, పని ఒత్తిడి వంటి వాటిపై చర్చించారు.

రైల్వే డ్రైవర్లు 14 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందని, రైల్వే ట్రాఫికింగ్, కంట్రోలర్ల అనుమతికి గూడ్స్ రైళ్లను నిలిపివేసి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆయన దృష్టికి తెచ్చారు.   రైల్వే ఉన్నతాధికారులు పద్మజ, బ్రహ్మానందం,  సురేశ్ రెడ్డి, ఆర్పీఎఫ్​సీఐ సంజీవరావు ఉన్నారు.