రద్దీ సమయాల్లో తోపులాటల్లేకుండా చూడాలి.. సౌత్ ​సెంట్రల్​ రైల్వే జీఎం ఆదేశం

రద్దీ సమయాల్లో తోపులాటల్లేకుండా చూడాలి.. సౌత్ ​సెంట్రల్​ రైల్వే జీఎం ఆదేశం
  • స్టేషన్లో ఎంట్రీ , ఎగ్జిట్​ ఇండికేషన్​ బోర్డులు పెట్టాలి 
  • అధికారులకు సౌత్ ​సెంట్రల్​ రైల్వే జీఎం ఆదేశం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మహా కుంభమేళా సందర్భంగా ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని కంట్రోల్​చేయడానికి, వారికి సాయం అందించడానికి ఎక్కువ సిబ్బందిని నియమించాలని అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్  జైన్  ఆదేశించారు. స్టేషన్లలో తోపులాట జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. రైల్వే ప్లాట్​ఫారాలపై తిరిగారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

రైల్వే స్టేషన్​లో 24 గంటల పాటు రద్దీని పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. స్టేషన్​ లోపలికి వచ్చేవారు, బయటకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మార్గనిర్దేశం చేయడానికి మరిన్ని సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రైలు ఎక్కే ముందు ప్రయాణికులకు మార్గనిర్దేశం చేయడానికి అదనపు ఆర్‌పీఎఫ్  సిబ్బందిని నియమించాలన్నారు. అనంతరం గూడ్స్​ రైళ్లలో సరుకుల లోడింగ్, అన్‌లోడింగ్​కు అదనపు లూప్ లైన్ల ఏర్పాటు, జోన్ మీదుగా బైపాస్ లైన్లు, యార్డ్  రీమోల్డింగ్ పనులు, సిగ్నలింగ్  పనుల పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.