రెయిన్ ఎఫెక్ట్.. మరో 28 రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

 

హైదరాబాద్: భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు అల్లకల్లోలం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్థమైంది. వరుణుడి ప్రకోపానికి ప్రాజెక్టులు, నదులు, కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. భారీ వర్షం, వరదలతో రోడ్లు, రైల్వే ట్రాక్‎లు కొట్టుకుపోవడంతో ప్రయాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షాల కారణంగా ఇప్పటికే పలు రైలు సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. ఇవాళ (మంగళవారం) కూడా మరికొన్ని ట్రైన్లను క్యాన్సిల్ చేయడంతో పాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు వెల్లడించింది. 

ఇవాళ 28 రైళ్లను రద్దు చేయగా..  కొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు ద.మ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు కాగా.. 152 సర్వీసులను దారి మళ్లించగా.. ఇవాళ మరో 28 ట్రైన్లను క్యాన్సిల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 4, 5,  7 వరకు పలు రైళ్లు రద్దైనట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు. 

Also Read:-చెరువు కబ్జా చేసి కట్టిన SR రెసిడెన్షియల్ కాలేజ్ సీజ్ చేసిన అధికారులు

కాగా, భారీ వరదతో మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మత్తు పనులు చేపట్టారు. మరో రెండు రోజుల్లో ట్రాక్‎ను పునరుద్ధరించి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.