- టికెట్ల కొనుగోలుకు అందుబాటులోకి వచ్చిన క్యూఆర్ కోడ్లు
- అన్ని స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన అధికారులు
- నగదు చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యలకు చెక్
- ప్రయాణికుల సమయం ఆదా
హైదరాబాద్, వెలుగు: రైలు ప్రయాణికులు సులభంగా టికెట్లు కొనుగోలు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే తాజాగా అన్ని జోన్ల పరిధిలో క్యూఆర్కోడ్స్కానర్లతో నగదు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రైల్వేలో డిజిటల్ పేమెంట్స్ అనుమతించాలని కొంతకాలంగా ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున డిమాండ్వస్తోంది. ఈ నేపథ్యంలో ఆరేళ్ల క్రితమే రైల్వేలో కూడా క్యాష్ లెస్ పేమెంట్స్ అమలు చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ.. అమలుకు మాత్రం నోచుకోలేదు.
మార్చి 21న కాచిగూడ రైల్వే స్టేషన్లో కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి దీనిపై చర్చించారు. తొలుత 14 ప్రధాన రైల్వే స్టేషన్లలో క్యూఆర్కోడ్స్కానర్లను ప్రారంభించారు. ఆయా స్టేషన్లలోని దుకాణాల వారు సైతం ప్రజల నుంచి బలవంతంగా నగదు వసూలు చేయకుండా చర్యలు తీసుకున్నారు. ఈ 5 నెలల ప్రయోగం మంచి ఫలితాలు ఇవ్వడంతో అన్ని జోన్ల పరిధిలోని స్టేషన్లలో డిజిటల్పేమెంట్స్కు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపింది.
పేమెంట్స్ చేయడం ఎలా అంటే..?
గతంలో అన్ని స్టేషన్లలోని టికెట్ కౌంటర్లలో ఆటోమెటిక్టికెట్వెండింగ్మిషన్లు, యూపీఐ చెల్లింపులు అనుమతించినా క్యూఆర్ కోడ్ (క్విక్ రెస్పాన్స్) పద్ధతిని మాత్రం అధికారులు అందుబాటులోకి తీసుకురాలేదు. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం ద్వారా కూడా చెల్లింపులు చేసేందుకు అవకాశం ఏర్పడింది.ఈ మేరకు అన్ని టికెట్ కౌంటర్లలో టికెట్ విండో వెలుపల ప్రత్యేక పరికరాలను ఏర్పాటుచేశారు. సిస్టమ్ లో అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత పక్కనే ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ తీసుకోవచ్చు.
అధికారులను అభినందించిన జీఎం
ప్రయాణికులు తమ టికెట్లను కొనుగోలు చేసేందుకు డిజిటల్ చెల్లింపుల పద్ధతిని ప్రవేశపెట్టిన కమర్షియల్, టెక్నికల్ స్టాఫ్ కృషిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. రైలు వినియోగదారులందరూ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విధానం పారదర్శకతకు, కచ్చితత్త్వానికి మైలు రాయిగా నిలుస్తుందని చెప్పారు. అలాగే నగదు చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రయాణికులకు సమయం కూడా కలిసి వస్తుందని పేర్కొన్నారు.