సంక్రాంతికి అదనంగా  200 స్పెషల్ రైళ్లు

సంక్రాంతికి అదనంగా  200 స్పెషల్ రైళ్లు

సంక్రాంతి కి ఊరెళ్లేందుకు జనం పెద్ద ఎత్తున క్యూ కడ్తున్నారు. ప్రయాణీకులతో బస్టాండ్స్ అన్నీ రద్దీగా మారగా... రైల్వే స్టేషన్స్ లోనూ సేమ్ సీన్ కన్పిస్తోంది. కొవిడ్ కేసులు పెరుగుతున్నా పండక్కి వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గట్లేదు. బెర్త్ కన్ఫామ్ కాకున్నా...ఎలాగొలా ఊరికి వెళ్లాలని స్టేషన్లకు భారీగా వస్తున్నారు. ప్రయాణీకుల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని... దక్షిణ మధ్య రైల్వే 200 రైళ్లను పెంచింది. కరోనా  పరిస్థితులతో ఆంక్షలు విధించామంటున్నారు అధికారులు.

గతేడాది కొవిడ్ తీవ్రంగా ఉండటంతో సంక్రాంతి పండక్కి పెద్దగా వెళ్లని జనం... ఈసారి జంట నగరాల నుంచి సొంతూళ్ళకు భారీగా బయల్దేరారు. దూర ప్రయాణాలు చేసేవారంతా ఎక్కువగా రైళ్లల్లోనే వెళ్తుండటంతో..... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తో పాటు ఇతర స్టేషన్లన్నీ జనంతో కిక్కిరిస్తున్నాయి. సంక్రాంతికి  వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలకు రెండు నెలల ముందు నుంచే రిజర్వ్ చేసుకున్నారు. ఈ మధ్యే బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం కన్ఫామ్ కాక ఇబ్బంది పడ్తున్నారు.

థర్డ్ వేవ్ లో భాగంగా కరోనా  కేసులు భారీగా వస్తుండటంతో జనం ఎక్కువ రోజులు ఉండేందుకు భారీ లగేజీలతో వెళ్తున్నారు. పండగ తర్వాత పరిస్థితి ఎలా  ఉంటుందోనని అన్నిరకాలుగా ప్రిపేరై ...ఊరెళ్తున్నట్లు తెలుస్తోంది. చాలా మందికి టిక్కెట్ రిజర్వ్ కాకపోయినా... RAC లేదా నిలబడి అయినా ఎలాగొలా వెళ్లాలని సిద్ధమయ్యారు. కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో రద్దీ మధ్య ప్రయాణం చేయాలంటే భయమేస్తోందని అంటున్నారు.

 తెలంగాణాలో పండుగకు వెళ్లేవారి కంటే కూడా ఆంధ్రప్రదేశ్, చుట్టుపక్కల రాష్ట్రాలకు  వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. నెలన్నర ముందే చాలా రైళ్లలో వెయిటింగ్  లిస్ట్  కనిపించింది. గోదావరి, గౌతమి, గరీబ్ రథ్  లాంటి రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. ఫలక్ నుమా, ఎల్ టీటీ, కోణార్క్  ఎక్స్ ప్రెస్ ల్లో పరిమితి దాటి ‘రిగ్రెట్ ’కు చేరింది. తెలంగాణ రూట్ల నుంచి వెళ్లే ట్రెయిన్స్ ఎక్కువే ఉన్నాయంటున్నారు రైల్వే అధికారులు. ఇదే టైంలో శబరిమలకు భారీగా భక్తులు వెళ్తుండటంతో అదనంగా 200 రైళ్లు వేశామని రైల్వే అధికారులు తెలిపారు.
 
కొవిడ్ కేసుల స్ప్రెడ్ అవుతుండటంతో రైల్వే అధికారులు ఆంక్షలు విధించారు. మాస్క్ పెట్టుకోకుంటే భారీగా ఫైన్ వేస్తున్నారు. అలాగే కుక్డ్ ఫుడ్స్ ను స్టేషన్లలో నిషేధించారు. ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు సికింద్రాబాద్ లో ఫ్లాట్ ఫాం టికెట్ 50 రూపాయలు, ఇతర స్టేషన్స్ లో 10 రూపాయల నుంచి  20 రూపాయలు చేశామని చెప్పారు.  స్పెషల్ ట్రెయిన్స్ పేరుతో ఈసారి అదనంగా వసూలు చేయట్లేదన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.  కొన్ని ట్రైన్స్ లో తప్పని పరిస్థితిల్లోనే ఛార్జీలు పెంచాల్సి వస్తోందంటున్నారు.

పండక్కి వెళ్లే ప్రయాణీకుల అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకు సాధారణ స్లీపర్ క్లాస్ తో పోలిస్తే, సువిధ ట్రైన్స్ కు నాలుగైదు రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేయడంపై విమర్శలొస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

ఇప్పటికే కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించింది