196 ట్రైన్స్.. 2.4 లక్షల మంది
12 గంటల్లోనే 43 శ్రామిక్ ట్రైన్స్ నడిపి రికార్డు
కూలీలకు ఫుడ్ ఫెసిలిటీ, టికెట్లలో రాయితీ
స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేకంగా కరోనా నివారణ చర్యలు
వలస కూలీల తరలింపులో సౌత్ సెంట్రల్ రైల్వే సక్సెస్
హైదరాబాద్, వెలుగు: లాక్‌డౌన్ వల్ల ఎక్కడికక్కడే చిక్కుకుపోయిన వలస కూలీల తరలింపులో సౌత్ సెంట్రల్ రైల్వే సక్సెస్ అయ్యింది. రైల్వే బోర్డు ఆదేశాలతో జోన్ పరిధిలో ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను నడిపి, లక్షలాది మంది వలస కూలీలను తమ సొంత రాష్ట్రాలకు చేర్చింది. వీరందరికీ ఫుడ్ ఫెసిలిటీస్ కల్పించింది. టికెట్లలో రాయితీ ఇచ్చింది. ట్రైన్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా కరోనా నివారణ చర్యలు తీసుకుంది.
తెలంగాణ నుంచి 128 ట్రైన్స్..
దేశంలో తొలి శ్రామిక్ రైలు మన దగ్గరి నుంచే వెళ్లింది. మే 1న లింగంపల్లి నుంచి జార్ఖండ్ కు వలస కూలీలను తరలించింది. మొత్తంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఆదివారం వరకు 196 శ్రామిక్ రైళ్లను నడిపి, 2.40 లక్షల మంది సొంత రాష్ట్రాలకు పంపించింది. మొదటి 16 రోజుల్లో లక్ష మందిని తరలించగా, గత వారం రోజుల్లోనే మరో లక్ష మందికి పైగా గమ్యస్థానం చేర్చింది. దీనిలో తెలంగాణ నుంచి 128 ట్రైన్స్ ద్వారా 1.56 లక్షల మంది, ఏపీ నుంచి 53 రైళ్లలో 66 వేల మంది, మహారాష్ట్ర నుంచి 15 రైళ్లలో 20 వేల మంది వలస కూలీలను తరలించారు.
ప్యాసింజర్స్‌కు ఫుడ్.. టికెట్లలో రాయితీ
ఫిజికల్ డిస్టేన్స్ కారణంగా ఒక్కో ట్రైన్‌లో 1,200 నుంచి 1,300 మందిని మాత్రమే తీసుకెళ్లింది. ట్రైన్స్‌లో ప్యాసింజర్స్‌కు ఫుడ్ ప్యాకెట్స్ అందించింది. ప్యాసింజర్ టికెట్ ధరలో సౌత్ సెంట్రల్ రైల్వే 85 శాతం సబ్సిడీ ఇస్తోందని, 15 శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని ఎస్సీఆర్ పీఆర్వో రాకేష్ తెలిపారు. కార్మికుల తరలింపులో ఎలాంటి గందరగోళం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేస్తూ కార్మికులను తరలించింది.
కరోనా నివారణ చర్యలు..
కరోనా వ్యాప్తి చెందకుండా రైల్వే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రైల్వే స్టేషన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేశారు. ప్యాసింజర్స్ పాటించాల్సిన నిబంధనలపై సూచిక బోర్డులను పెట్టారు. ఫిజికల్ డిస్టేన్స్ పాటించేలా.. స్టేషన్‌లో ప్రత్యేకంగా రౌండ్ మార్కింగ్స్ చేశారు. కన్ఫర్మ్‌డ్ టికెట్ ఉంటేనే స్టేషన్ లోపలికి పంపించారు. ఎంట్రెన్స్‌లో ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేశారు. ప్రయాణికులకు శానిటైజర్, మాస్క్‌లు ఇచ్చారు. ప్రతి ప్యాసింజర్‌కు హోం క్వారంటైన్ స్టాంప్ వేశారు. ఎంట్రెన్స్, ఎగ్జిట్స్ సపరేట్‌గా పెట్టారు.
12 గంటల్లోనే 43 ట్రైన్స్‌తో రికార్డు
రైళ్ల నిర్వహణలో భాగంగా 12 గంటల సమయంలోనే వివిధ స్టేషన్ల నుంచి రికార్డు స్థాయిలో 43 శ్రామిక్ ట్రైన్స్‌ను నడిపింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ రైళ్లను నడిపింది. వీటిలో 40 వేల మంది కూలీలను తరలించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, ఘట్‌కేసర్, లింగంపల్లి, మహబూబ్‌నగర్, కాజిపేట స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలుదేరాయి. తెలంగాణ నుంచి బీహార్‌కు 10, జార్ఖండ్‌కు 6, యూపీకి 8, ఒడిశాకు 12, మరో 4 ట్రైన్స్ ఇతర రాష్ట్రాలకు నడిచాయి.
సమర్థంగా నిర్వహించిన్రు..
వలస కూలీల తరలింపును అధికారులు సమర్థంగా నిర్వహించారు. రికార్డు స్థాయిలో రైళ్లను నడిపిన అధికారులు, స్టాఫ్‌కు అభినందనలు. కరోనా జాగ్రత్తలు తప్పక పాటించాలి. రానున్న 10 రోజుల్లో మరో 26 వేల శ్రామిక్ రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డు ప్రకటించింది. అందువల్ల అప్రమత్తం ఉండాలి.
– గజానన్ మాల్య, ఎస్సీఆర్, జీఎం
For More News..