రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా స్పెషల్ ట్రైన్స్

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హోలీ సందర్భంగా స్పెషల్ ట్రైన్స్

హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్ చర్లపల్లి నుంచి ఒడిశాలోని భువనేశ్వర్‌కు రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఎస్‎సీఆర్ ప్రకటించింది. రైలు నంబర్ 0840.. మార్చి 11, 18, 25 తేదీలలో చర్లపల్లి నుండి భువనేశ్వర్ వెళ్తోందని.. ఈ రైలు ఉదయం 9:50 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:10 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 

అలాగే.. ట్రైన్ నెంబర్ 08479.. మార్చి 10, 17, 24 తేదీలలో భువనేశ్వర్ నుంచి చర్లపల్లి మధ్య ప్రయాణిస్తోందని వెల్లడించింది. ఈ ట్రైన్ మధ్యాహ్నం 12:10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 7:50 గంటలకు చర్లపల్లి రీచ్ అవుతోందని తెలిపింది. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ట్రైన్ సర్వీసును వినయోగించుకోవాలని కోరింది. ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది.

కాగా, ఈ ఏడాది మార్చి 14న హోలీ వేడుకలు జరగనున్నాయి. హోలీ పండుగను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్న పెద్ద అంతా ఒక్క చోట చేరి రంగులు పూసుకుంటూ ఆనందంగా జరుపుకుంటారు. ఉద్యోగులు, కార్మికులు హోలీ పండక్కి ఎక్కడ ఉన్న సరే సొంతూర్లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వే హోలీ పండుగ సందర్భంగా స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది.