ఢిల్లీ లెవెల్లో దక్షిణాది లీడర్ల హవా!

ఢిల్లీ లెవెల్లో దక్షిణాది లీడర్ల హవా!

మొదటి జనరల్ ఎలక్షన్ (1951–52) నుంచి ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చాలా మంది డైనమిక్ లీడర్లలో ఎక్కువ మంది దక్షిణాది నుంచే ఉన్నారు. సౌత్‌ పరిధిలోకి వచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు చెందిన ఆయా నేతల గురించి క్లుప్తంగా..

తమిళనాడు

రాజాజీ: ఫ్రీడం ఫైటర్​. సహాయ నిరాకరణో ద్యమంలో పాల్గొన్నారు. దేశ తొలి, చివరి గవర్నర్​ జనరల్. కాంగ్రెస్​ పార్టీ జనరల్​ సెక్రటరీగా చేశారు. నెహ్రూతో విభేదించి సొంత పార్టీ పెట్టారు. మద్రాస్​ రాష్ట్రానికి సీఎం అయ్యారు.

కామరాజ్​ నాడార్​: నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రజానేతగా పేరొందిన పోరాట యోధుడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నెహ్రూకి సన్నిహితుడు. తమిళనాడుకి దాదాపు పదేళ్లు సీఎంగా చేసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు​​ అయ్యారు.  ఇందిరాగాంధీని ప్రధానిని చేయటానికి మాస్టర్​ ప్లాన్​ వేశారు. తద్వారా దేశ రాజకీయాల్లో కింగ్​ మేకర్​ అయ్యారు.

జయలలిత: నటి, అన్నాడీఎంకే చీఫ్​. తమిళనాడు సీఎంగా చేశారు. 1998లో ఎన్​డీఏకి మద్దతివ్వటం ద్వారా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రక్షణ మంత్రి జార్జ్​ ఫెర్నాండెజ్​ని తీసేయాలనే డిమాండ్​కి ప్రధాని వాజ్​పేయి ఒప్పుకోకపోవటంతో సపోర్ట్​ విత్​డ్రా చేశారు. లోక్​సభ బల పరీక్షలో ఆయన ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో​ 13 నెలలకే కుప్పకూలింది.

కేరళ

ఈఎంఎస్​ నంబూద్రిపాద్​: దేశంలో తొలిసారి ఒక రాష్ట్రానికి సీఎం అయిన తొలి కమ్యూనిస్టు నేత. కేరళ మొదటి ముఖ్యమంత్రి మాత్రమే కాక, ఓట్ల ద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి. 1957లో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ఆర్టికల్‌‌ 356 ద్వారా అప్పటి ప్రధాని నెహ్రూ కూలదోయించారు. భూ సంస్కరణలు, విద్య రంగాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టారు.

ఆంధ్రప్రదేశ్​

ఎన్​టీఆర్​: తెలుగు సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా, రాజకీయాల్లో ఎదురులేని మహానాయకుడిలా వెలుగొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తెలుగుదేశం పార్టీ(టీడీపీ)ని పెట్టి, తొమ్మిది నెలల్లో అధికారంలోకి తెచ్చి రికార్డ్​ నెలకొల్పారు. 1984 లోక్​సభ ఎన్నికల్లో ఏపీ నుంచి 42 స్థానాల్లో 30 సీట్లు గెలిచి లోక్​సభలో సెకండ్​ లార్జెస్ట్​ పార్టీగా టీడీపీని నిలిపారు. పార్లమెంట్​ దిగువ సభలో ప్రతిపక్ష హోదా పొందిన తొలి ప్రాంతీయ పార్టీగా టీడీపీ ప్రత్యేకత సాధించింది. 1989లో దేశవ్యాప్తంగా రీజనల్​ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి నేషనల్​ ఫ్రంట్ ​కట్టారు. వీపీ సింగ్​ని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టారు. జాతీయ రాజకీయాల్లో ఫ్రంట్​ల ట్రెండ్​ సృష్టించారు.

కాసు బ్రహ్మానందరెడ్డి:  ఫ్రీడం ఫైటర్​. క్విట్​ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కి సుదీర్ఘంగా (ఏడున్నరేళ్లపాటు) పనిచేసిన తొలి​ ముఖ్యమంత్రి. కాంగ్రెస్​ పార్టీకి ఎన్నికైన అధ్యక్షుల్లో కాసు బ్రహ్మానందరెడ్డి ఒకరు. మిగతా వారంతా దాదాపు నామినేట్‌‌ అయినవారే. ఎమర్జెన్సీ తర్వాత ఏకంగా ఐరన్​ లేడీ ఇందిరాగాంధీనే కాంగ్రెస్‌‌ నుంచి బహిష్కరించారు.

చంద్రబాబు: మామ ఎన్​టీఆర్​ మొదలుపెట్టిన ఫ్రంట్​ల ట్రెండ్​ని కొనసాగించారు. 1996 లోక్​సభ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో ప్రాంతీయ పార్టీలను యునైటెడ్​ ఫ్రంట్​ పేరిట ఏకం చేశారు.  1996–98లో కేంద్రంలో దేవెగౌడ, గుజ్రాల్‌‌ ప్రభుత్వాల ఏర్పాటులో చక్రం తిప్పారు. ఇప్పుడు కూడా బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నారు.

వెంకయ్యనాయుడు: ఉత్తరాది పార్టీగా చెప్పుకునే బీజేపీకి నేషనల్​ ప్రెసిడెంట్​ అయిన తెలుగువాడు. కేంద్ర మంత్రిగా చేశారు. తర్వాత ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించారు.

తెలంగాణ

పీవీ నరసింహారావు: దేశానికి ప్రధాని అయిన ఏకైక తెలుగువాడు. ఆ పదవి చేపట్టిన గాంధీ–నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి. మైనారిటీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఐదేళ్ల పాటు నడిపారు. కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్​గా కూడా వ్యవహరించారు. ఏపీ సీఎంగా ఉండగా భూ సంస్కరణల చట్టం తెచ్చారు. ప్రధాని అయ్యాక దేశాన్ని ఆర్థిక సంస్కరణలు, సరళీకృత విధానాలతో పరుగులు తీయించారు.

కేసీఆర్: ఉద్యమ నేతగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా జాతీయ పార్టీలను మోటివేట్​ చేసి, సపోర్ట్​ కూడగట్టారు. రాష్ట్రం ఇవ్వక తప్పని పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి కల్పించారు.

కర్ణాటక

హెచ్​డీ దేవెగౌడ: జేడీ(ఎస్​) పార్టీ నేషనల్​ ప్రెసిడెంట్​. కర్ణాటక సీఎంగా చేశారు. ఆ తర్వాత 1996 జూన్​ నుంచి 1997 ఏప్రిల్​ 21 వరకు 324 రోజుల పాటు యునైటెడ్‌‌ ఫ్రంట్‌‌ తరఫున దేశానికి ప్రధానిగా సేవలందించారు. మొదట్లో కాంగ్రెస్​ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ చీలిపోయినప్పుడు కాంగ్రెస్(ఓ)​లో చేశారు.