దక్షిణ భారత్లోని ఏకైక మంకీ రెస్క్యూ సెంటర్ ఎత్తేస్తున్నరు

దక్షిణ భారత్లోని ఏకైక మంకీ రెస్క్యూ సెంటర్ ఎత్తేస్తున్నరు
  • నిర్మల్ జిల్లా ఫారెస్ట్ శాఖ నిర్ణయం 
  • ఆర్థిక భారంగా సెంటర్ నిర్వహణ
  • పర్మిషన్ కోసంరాష్ట్ర సర్కార్ కు లేఖ

నిర్మల్, వెలుగు: దక్షిణ భారత్ లోని ఏకైక మంకీ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ మూసివేతకు సిద్ధమవుతోంది. ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మల్ జిల్లా అటవీశాఖ కొద్ది రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వా నికి లేఖ రాయడంపై చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని  కోతులను వైల్డ్ లైఫ్ యాక్ట్ షెడ్యూల్–1 జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. 

దీంతో సెంటర్ నిర్వహణ ఆర్థికంగా భారంగా మారింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గండి రామన్న అర్బన్ పార్కులో మంకీ రెస్క్యూ సెంటర్ ను నాలుగేండ్ల కింద  రూ. 2  కోట్ల నిధులతో నిర్మించారు. అటవీ, పశుసంవర్ధక శాఖలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.  సెంటర్ లో కోతులకు స్టెరిలైజేషన్(కుటుంబ నియంత్రణ ఆపరేషన్) చేసిన తర్వాత పది రోజుల అబ్జర్వేషన్ అనంతరం అడవిలో వదిలిపెడతారు.  కరోనా కారణంగా రెండేండ్ల పాటు సెంటర్ సరిగా పని చేయలేదు. 

స్టెరిలైజేషన్ కు తీసుకురాకపోతుండగా..

రెస్క్యూ సెంటర్ లో పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డాక్టర్ ను, సిబ్బందిని నియమించినా మిగతా పనులన్నీ అటవీ శాఖ చూసుకుంటోంది.  పంచాయతీలు, మున్సిపాలిటీలు, వీడీసీలు తమ ప్రాంతాల్లోని కోతులను సొంత ఖర్చులతో పట్టించి సెంటర్ కు తరలించాలి. కానీ నిధుల కొరత కారణంగా అవి చేతులెత్తేశాయి. దీంతో 2020 నుంచి ఇప్పటి వరకు కేవలం1,550 కోతులకు మాత్రమే సెంటర్ లో స్టెరిలైజేషన్ చేశారు. 

ప్రతిరోజు 100 లోపు కోతులకు స్టెరిలైజేషన్ చేయొచ్చని వెటర్నరీ డాక్టర్ చెబుతున్నారు.  ఇందుకు పంచాయతీలు, మున్సిపాలిటీలు సహకరించకపోవడంతో  కోతులను స్టెరిలైజేషన్ కు తీసుకురావడం సాధ్యం కావడం లేదు. దీంతో డాక్టర్ తో పాటు సిబ్బంది ఖాళీగానే ఉంటున్నారు. మరోవైపు కోతుల సంఖ్య పెరిగిపోతుండడంతో  ప్రజలతో పాటు రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

కోతుల సమస్యకు పరిష్కారం ఏదీ?

మంకీ రెస్క్యూ సెంటర్ ను మూసివేస్తే భవిష్యత్ లో కోతుల జనాభా నియంత్రణ సవాల్ గా మారనుంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు నిధుల కొరత కారణంగా కోతులను పట్టుకునే చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కో కోతిని పట్టేందుకు రూ. 1,000 నుంచి రూ.1,500 వరకు ఖర్చవుతుంది. కోతులను పట్టేవారు ఎక్కువ సంఖ్యలో లేకపోవడం కూడా సమస్యగా మారింది. 

ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తే మంకీ రెస్క్యూ సెంటర్ కొనసాగే చాన్స్ ఉంది. ఎత్తేస్తే కోతుల సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలేదు. కోతుల సంఖ్యను తగ్గించాలంటే, వాటి జనాభాను నియంత్రించాల్సిందే తప్ప ఇతర మార్గాలు లేవని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.