ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా పంపే చెత్త బెలూన్లు దక్షిణ కొరియా వైమానిక రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. విమానాల ల్యాండిగ్, టేకాఫ్ కు ఇబ్బందికరంగా మారింది. ఈ బెలూన్ల కారణంగా జూన్ నుంచి తమ రాజధాని సియోల్‌లోని రెండు విమానాశ్రయాల్లోని రన్‌వేలను పలుమార్లు మూసేయాల్సి వచ్చిందని సౌత్ కొరియా చెబుతోంది. మొత్తం ఆరు గంటలకు పైగా తమ వైమానిక సేవలకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఇచియాన్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఐదో స్థానంలో నిలుస్తుంది. ఈ విమానాశ్రయం కూడా చెత్తతో సతమతమవుతోంది.
ALSO READ | అమెరికా నుంచి తిరిగొచ్చిన మోదీ
జూన్ 26వ తేదీనే ఏకంగా ఇచియాన్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ రన్‌వేను దాదాపు మూడు గంటలు మూసివేయాల్సి వచ్చింది. మే చివరివారం నుంచి ఉత్తరకొరియా వేల సంఖ్యలో చెత్త నింపిన బ్యాగ్‌లు కట్టిన బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. తాజాగా వీటి సంఖ్య 5,500 దాటేసిందని అంచనా. ఈ బెలూన్లలో ప్రచార కరపత్రాలు వంటివి కూడా ఉన్నాయి. ఈ బెలూన్లు దేశాధ్యక్షుడి నివాస ప్రాంగణంలో కూడా కూలి సంచలనం సృష్టించాయి. మరోసారి ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై పడటంతో అధికారులు పరుగులుపెట్టాల్సి వచ్చింది.