సియోల్: జెజు ఎయిర్ లైన్స్. ఈ పేరు వింటేనే దక్షిణ కొరియాలో విమాన ప్రయాణం చేసేవారు వణికిపోతున్నారు. దక్షిణ కొరియాలో డిసెంబర్ 29న జెజు ఎయిర్ లైన్స్ విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన జరిగి దాదాపు వారం రోజులయింది. అయినా.. ఆ భయానక ఘటన నుంచి దక్షిణ కొరియా విమాన ప్రయాణికులు ఇప్పటికీ కోలుకోలేదు. జెజు ఎయిర్ లైన్స్ విమానాల్లో ప్రయాణం చేసేందుకు విమాన ప్రయాణికులు వెనకడుగు వేస్తుండటమే ఇందుకు నిదర్శనం.
ఒక్క విమాన ప్రమాదంలో, అదీ ఒకే విమానంలోని అంతమంది చనిపోయే సరికి ఆ ఎయిర్ లైన్స్ విమానాలకు ఈ దుర్ఘటన అనంతరం ఆదరణ కరువైంది. దురదృష్టం జెజు ఎయిర్ లైన్స్ కంపెనీని ఎంతలా వెంటాడుతుందంటే.. ఒక్క విమాన ప్రమాదంతో ఆ ఎయిర్ లైన్స్ మనుగడే ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ ఎయిర్ లైన్స్ కంపెనీ ఈఫీసుల్లో ఇప్పటికే దక్షిణ కొరియా అధికార యంత్రాంగం తనిఖీలు చేసింది. ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిమ్ ఈ-బెపై ట్రావెల్ బ్యాన్ విధించింది.
జెజు ఎయిర్ లైన్స్లో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ ఎయిర్ లైన్స్ విమానాల్లో ప్రయాణాలకు ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. ఫలితంగా.. దక్షిణ కొరియాలోనే చౌక ధరలకు విమాన ప్రయాణం చేసేందుకు వీలున్న ఎయిర్ లైన్స్గా పేరున్న జెజు ఎయిర్ లైన్స్ నష్టాలను చవిచూస్తుంది. వాస్తవానికి రెండేళ్ల నుంచి జెజు ఎయిర్ లైన్స్ కూడా ఇతర విమానయాన కంపెనీల మాదిరిగానే టికెట్ల ధరలను పెంచింది. దక్షిణ కొరియాలో ఉన్న ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులే ఇందుకు కారణం. ఈ కంపెనీ స్టాక్స్ కూడా ఇప్పటికే దారుణంగా పడిపోయాయి. ఈ విమాన ప్రమాదం జరిగినప్పటి నుంచి స్టాక్స్ 10 శాతం క్షీణించాయి. 2025 మార్చి వరకూ సదరు ఎయిర్ లైన్స్ విమానాలను 15 శాతం తగ్గించి నడపాలని జెజు ఎయిర్ లైన్స్ నిర్ణయించింది.