ఆటోగ్రాఫ్ సాకుతో వచ్చి.. మెడపై కత్తితో దాడి.. ఆస్పత్రిపాలైన కొరియన్ లీడర్

సియోల్: సౌత్​కొరియా ప్రతిపక్ష పార్టీ నేత లీ జే-మ్యూంగ్ పై కత్తి దాడి జరిగింది. మంగళవారం బుసాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నడుస్తుండగా ఓ దుండగుడు దూసుకొచ్చి కత్తితో మెడపై పొడిచాడు. ఆటోగ్రాఫ్​  కోసమని దగ్గరకు వెళ్లిన అతడు దాడికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లీని వెంటనే హాస్పిటల్​కు తరలించారు.

ఈ దాడిలో ఆయనకు మెడపై ఒక సెంటీమీటర్​మేర గాయమైనట్లు మీడియా సంస్థలు తెలిపాయి. కాగా ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​అయింది.  ఈ ఘటనను సౌత్​కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఖండించారు. ఇది క్షమించరాని చర్య అని పేర్కొన్నారు. లీ  జే-మ్యూంగ్ త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.