సియోల్: సౌత్ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇద్దరు ఫ్లైట్ అటెండెట్స్లో ఒకరు సోమవారం స్పృహలోకి వచ్చారు. బాధితులను 32 ఏండ్ల మహిళ లీ గా, 25 ఏండ్ల యువకుడు క్వాన్గా గుర్తించారు. వీరికి మోప్కో సెంట్రల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. తలకు గాయాలై, చీలమండ ఎముకలు విరిగిని లీ ట్రీట్మెంట్ తర్వాత సోమవారం మెలకువలోకి వచ్చారు. ‘‘ఏమైంది? నేను ఇక్కడెందుకున్న?” అని అక్కడున్న డాక్టర్లను ఆమె ప్రశ్నించారు.
విమాన ప్రమాదంతో ఆమె తీవ్రమైన భయం, షాక్‌కు గురైందని డాక్టర్లు మీడియాకు చెప్పారు. లీ, క్వాన్ డేంజర్ నుంచి భయటపడ్డారని వారి ప్రాణాలకు ఇప్పుడేం ముప్పు లేదని తెలిపారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు లీ ని రాజధాని సియోల్‌లోని ఆసుపత్రికి తరలించారు. విమానం పేలిపోయిన తర్వాత ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ గాయాలతో విమానం తోక భాగంలో గాయాలతో ఉన్న వీరిద్దరి గుర్తించి రక్షించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఫ్లైట్ బ్లాక్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు.