జపాన్ సముద్రంలోని ఓ ద్వీపం లో దక్షిణ కొరియాకు చెందిన కెమికల్ ట్యాంకర్ బుధవారం బోల్తాపడింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. మరో ఇద్దరు గల్లంతవ్వగా.. ఇంకొకరు ప్రాణాలతో బయటపడ్డారు. ట్యాంకర్‌లో 980 టన్నుల యాక్రిలిక్ యాసిడ్ తీసుకెళ్తున్నట్లు కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. నౌక జపాన్‌లోని హిమేజీ ఓడరేవు నుంచి దక్షిణ కొరియాలోని ఉల్సాన్‌కు వెళ్తోందని వివరించారు. టోక్యో నుంచి వెయ్యి కి.మీ (620 మైళ్లు) దూరంలోని ద్వీపంలో నౌక పూర్తిగా తలకిందులైనట్లు చెప్పారు. ప్రమాద సమయంలో అందులో ఇండోనేసియాకు చెందిన 8 మంది, ఇద్దరు దక్షిణ కొరియా దేశస్థులు, మరో చైనా పౌరుడు ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. డెడ్ బాడీలను బాధిత కుటుంబాలకు అప్పగించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను దక్షిణ కొరియా విదేశాంగ శాఖ ఆదేశించింది. నౌక ఎలా బోల్తా పడిందో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది.