చెన్నై: ఛేజింగ్‌లో జెమీమా రొడ్రిగ్స్ (30 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 53 నాటౌట్) చెలరేగినా.. తొలి టీ20లో ఇండియా విమెన్స్ టీమ్ బోణీ చేయలేకపోయింది. శుక్రవారం రాత్రి ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 12 రన్స్ తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రొటీస్ 1–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 189/4 స్కోరు చేసింది.
తజీమ్ బ్రిట్స్ (81), మరిజేన్ కాప్ (57) హాఫ్ సెంచరీలు సాధించారు. కెప్టెన్ లారా వోల్‌వర్త్ (33)తో తొలి వికెట్‌కు 50 రన్స్ జత చేసిన బ్రిట్స్.. కాప్‌తో రెండో వికెట్‌కు 96, ట్రయాన్ (12)తో మూడో వికెట్‌కు 38 రన్స్ జోడించి ఇన్నింగ్స్ ఆఖరి బాల్‌కు ఔటైంది. పూజ, రాధా చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ఇండియా 20 ఓవర్లలో 177/4 స్కోరుకే పరిమితమైంది. షెఫాలీ (18), స్మృతి (46) తొలి వికెట్‌కు 56 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు.
హేమలత (14) ఫెయిలైనా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (35), జెమీమా చివరి వరకు పోరాడారు. చివరి 12 బాల్స్‌లో 39 రన్స్ అవసరమైన దశలో జెమీమా రెండు ఫోర్లు, ఓ సిక్స్, కౌర్ ఓ ఫోర్‌తో ఆశలు రేకెత్తించారు. కానీ, చివర్లో మలాబా (1/32) కట్టడి చేసింది. బ్రిట్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.