హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ఉండదని సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పష్టం చేశారు. సామాన్యులపై కరెంట్ చార్జీల భారం వేయడం లేదని స్పష్టం చేశారు. సదరన్ డిస్కం ప్రతిపాదించిన విద్యుత్ యాగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్స్ (ఏఆర్ఆర్) పై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగరావు అధ్యక్షతన బుధవారం బహిరంగ విచారణ జరిగింది. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏఆర్ఆర్ ప్రతిపాదనలను ముషారఫ్ ఫారూఖీ వివరించారు. హైటెన్షన్ (హెచ్‌టీ 11కేవీ ) ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా చార్జీల భారం పడదని చెప్పారు.
నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు ఫిక్స్డ్చార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్ర పరిధిలో పీక్ డిమాండ్ 15,623 మెగావాట్ల కు చేరిందని, సదరన్ డిస్కం పరిధిలో అది 9,910 మెగావాట్లుగా నమోదైనట్టు చెప్పారు. విద్యుత్ పంపిణీ నష్టాలను 4.75 శాతానికి తగ్గించామని తెలిపారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనను ప్రోత్సహించడం కోసం ఈ రంగాలపై భారం వేయడం లేదని చెప్పారు. ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ స్టేషన్స్ (ఎల్టీఈవీ) కు ఫిక్స్డ్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు- సీఎండీ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. మెయింటెనెన్స్ రిపేర్ పనుల్లో పారదర్శకత కోసం లేటెస్ట్ టెక్నాలజీ పరిజ్ఞానంతో టీజీఐఎస్, అసెట్, ఇన్‌స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ సిస్టమ్(టీజీ ఎయిమ్స్) ను రూపొందించినట్టు తెలిపారు.
డిస్కం ప్రతిపాదనలపై నిపుణుల అభ్యంతరాలు
సదరన్డిస్కం చేసిన ప్రతిపాదనలపై పలువురు విద్యుత్ రంగ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. భారీ మొత్తంలో ఫిక్స్ డ్ చార్జీలు పెంచడం ఎందుకని ఎన్. వేణుగోపాల్ రావు ప్రశ్నించారు. గ్రీన్ ఎనర్జీ వల్ల సర్ ప్లస్‌లోకి రాష్ట్రానికి తీసుకురావాలనే ప్రభుత్వ నిర్ణయం మంచిదేనని, కానీ అదిప్పుడు అంత అవసరం లేదని చెప్పారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, సిబ్భంది, అధికారులు పైసలు ఇవ్వందే పని చేయడం లేదని భారతీయ కిసాన్‌సంఘ్ ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గొర్రెలు, పశుపోషణ వృత్తిలో ఉన్న యాదవ, కురుమల డైరీ ఫామ్‌లను అగ్రికల్చర్ సెక్టార్‌గా గుర్తించాలని ఆలిండియా యాదవ సంఘం నేత రమేశ్ యాదవ్ కోరారు.
ఓపెన్ ఎంక్వైరీకి కేటీఆర్ డుమ్మా
ఈఆర్సీకి బహిరంగ విచారణకు హాజరవుతానని ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డుమ్మా కొట్టారు. బీఆర్ఎస్ తరఫున మాజీ స్పీకర్ మధుసూదనాచారితోపాటు పలువురు లీడర్లు హాజరయ్యారు. కరెంట్ చార్జీలు పెంచొద్దని, విద్యుత్ సంస్థలను లాభాల సంస్థలా చూడొద్దని మధుసూదనాచారి సూచించారు. విద్యుత్ చార్జీల పెంపు అనేది పేదలకు భారంగా మారుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. చార్జీల పెంపులాంటిది ఏమైనా ఉంటే ప్రభుత్వం ముందుకు వచ్చి భరించాలని, సబ్సిడీ రూపంలో అందించాలని సూచించారు.