- ఆఫీసర్లకు సదరన్ డిస్కం ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రానున్న వేసవికాలం విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను సదరన్ డిస్కం ఆదేశించింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా విద్యుత్ మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం నోడల్ అధికారిగా నియమితులైన ఎల్.పాండ్య ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉన్నతాధికారులతో విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు .
గతేడాది వేసవిలో అత్యధిక విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదైందని గుర్తు చేశారు. ఈ ఏడాది 25 శాతం అదనంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం, ఇతర సమస్యల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ ను సంప్రదించాలని సూచించారు.