దక్షిణాది నటుల పొలిటికల్ ఎంట్రీలు ఎక్కువ..సక్సెస్​లు కొందరివే

దక్షిణాది నటుల పొలిటికల్ ఎంట్రీలు ఎక్కువ..సక్సెస్​లు కొందరివే

తమిళనాట ప్రముఖ స్టార్ హీరో ‘ఇళయ దళపతి’ విజయ్ జోసఫ్ చంద్రశేఖర్ రాజకీయ అరంగేట్రంతో దక్షిణాది రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. తాజాగా ఆయన ‘తమిళగ వెట్రి కజగం’(టీవీకే) పార్టీని లాంచ్ చేశారు. ఒక్కసారిగా వెండితెర నుంచి  విజయ్ పొలిటికల్ కెరీర్ వైపు టర్న్ తీసుకుని సెలెబ్రెటీ నుంచి సామాన్యుడి దాకా ఆసక్తిని రేకెత్తించారు.  రాజకీయాల్లోకి సినీ స్టార్లు రావడం కొత్తేమీ కాదు. వీరికుండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే  సినీ జీవితం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చే నటులు దక్షిణాదిన ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వీరిలో కొందరు  సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిల్యూర్ అయ్యారు. 

దక్షిణాది నుంచే ఎక్కువగా పాలిటిక్స్​లోకి ఎంట్రీ

ద్రవిడనాట రచయిత, నటుడు, జర్నలిస్టు సీఎన్ అన్నాదురై(కాంజీవరం నటరాజన్ అన్నాదురై) 1950లోనే ‘ద్రవిడ మున్నేట్ర కజగం’(డీఎంకే) స్థాపించారు. తమిళనాట ముఖ్యమంత్రిగా పీఠమెక్కిన తొలి నటుడిగా చరిత్రకెక్కారు. ఆయన బాటలోనే శిష్యులైన రచయిత, నటుడు కళైంజర్​గా ప్రసిద్ధి చెందిన ఎంకే కరుణానిధి,  ప్రముఖ తమిళ స్టార్ హీరో మరుదూర్‌‌‌‌ గోపాలన్‌‌‌‌ రామచంద్రన్‌‌‌‌(ఎంజీఆర్‌‌‌‌) నడిచారు. రాజకీయాల్లోకి రాకముందే వీరిద్దరూ సినీ పరిశ్రమలో రాణించారు.అన్నాదురై మరణం తర్వాత డీఎంకేను కరుణానిధి నడిపించారు. పార్టీలో విభేదాల కారణంగా ఎంజీఆర్ విడిపోయి.. 

సొంతంగా1972లో ‘అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం’(అన్నాడీఎంకే)ను స్థాపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలోనే తొలిసారి ముఖ్యమంత్రి అయిన స్టార్ హీరో ఎంజీఆర్ చరిత్ర సృష్టించాడు. కరుణానిధి  తన పొలిటికల్ కెరీర్​లో ఐదుసార్లు సీఎంగా పనిచేశారు. ఇక ఎంజీఆర్ వారసురాలిగా వెండితెరపై స్టార్ హీరోయిన్ గా వెలిగిన.. అమ్మ అని ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకునే ‘పురచ్చితలైవి’ జయలలిత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  తమిళనాట తొలి మహిళా సీఎంగా రికార్డులకెక్కారు. రెండు దశాబ్దాల పాటు ద్రవిడ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత బద్ధ శత్రువులుగానూ పేరుపొందారు.  

తెలుగునాట ఎన్టీఆర్ తో స్టార్ట్ 

ఎంజీఆర్​ను  స్ఫూర్తిగా తీసుకుని తెలుగునాట నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)  రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉమ్మడి ఏపీలో 1982 మార్చిలో  తెలుగుదేశం (టీడీపీ) పార్టీని స్థాపించారు. తొమ్మిది నెలల్లోనే1983లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అనంతరం 1984–-85, 1985–-89, 1994–-95ల మధ్య కాలంలోనూ సీఎంగా పనిచేశారు. ఆయన అడుగు జాడల్లో ఇంకొందరు సినీనటులు పాలిటిక్స్ లోకి వచ్చారు. 2005లో తెలంగాణలోనూ నటి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం( పీఆర్పీ) స్థాపించారు. తదనంతరం రాజకీయ పరిణామాలతో 2011లో పీఆర్పీని కాంగ్రెస్‌‌‌‌లో విలీనం చేశారు. 

ఇక ​ ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత 2014లో  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ( పీకే) జనసేన పార్టీ పెట్టారు. 2019లో పోటీ చేసినా ఓటమి చెందారు. తిరిగి 2024లో ఎన్డీఏ కూటమి నుంచి గెలిచి ప్రస్తుతం ఏపీ డిఫ్యూటీ సీఎంగా ఉన్నారు. సీఎంగా ఉంటూనే జయలలిత 2016లో ఆకస్మిక మరణం చెందారు.  అన్నాడీఎంకే నేతలు వర్గాలుగా చీలిపోగా.. ప్రస్తుతం పార్టీ ప్రాభవం కోల్పోయింది. ఇదే చాన్స్​గా చేసుకుని విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారనేది ఆయన నిబద్ధతపై, సమర్థతపై ఆధారపడి కాలం నిర్ణయిస్తుంది. ఇలా దశాబ్దాలుగా దక్షిణాది రాజకీయాల్లో సినీనటుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా పార్టీ స్థాపించిన నటుడు విజయ్ పొలిటికల్​ సక్సెస్​ను కాలమే నిర్ణయించనుంది.

ద్రవిడనాట మరికొందరు నటులు

మరో నటుడు శివాజీ గణేశన్ 1988లో ‘తమిళగ మున్నేట్ర మున్నని’(టీఎంఎం)ని స్థాపించారు. మరుసటి ఏడాదే1989లో ‘జనతా దళ్’లో  విలీనం చేశారు. ఇంకో నటుడు శరత్‌‌‌‌కుమార్‌‌‌‌ 2007లో  ‘ఆల్‌‌‌‌ ఇండియా సమతువ మక్కల్‌‌‌‌ కట్చి’ (ఏఐఎస్‌‌‌‌ఎంకే)ని స్థాపించారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేశారు. మరో నటుడు విజయ్‌‌‌‌కాంత్ 2005లో  ‘దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం’(డీఎండీకే) ఏర్పరిచారు. 

2011లో విజయ్‌‌‌‌కాంత్ ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా వ్యవహరించారు. మరో నటుడు కార్తీక్ 2009లో ‘అహిళ ఇండియా నాడలమ్ మక్కల్ కచ్చి’(ఏఐఎన్ఎంకే) లాంచ్ చేశారు. ఇంకో నటుడు కమలహాసన్ 2018లో ‘ మక్కల్ నీది మయ్యమ్’ ఏర్పాటు చేసి ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ప్రముఖ సూపర్ స్టార్ రజినీకాంత్‌‌‌‌ 2017లో ‘రజినీ మక్కల్‌‌‌‌ మండ్రం’ని ఏర్పాటు చేశారు. 2020 డిసెంబర్ లో అనారోగ్యం కారణంగా రద్దు చేశారు. వీరంతా రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ తో వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు.

  

- వేల్పుల సురేష్