
దేశంలో నైరుతి రుతుప వనాలు చురుగ్గా కదులుతున్నాయి. నాలుగు రోజుల క్రితం మే 30న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిన్న( జూన్ 2) కర్ణాటక మీదుగా ఏపీలోని రాయలసీమలోకి ఎంటర్ అయ్యాయి. ఇవాళ( జూన్ 3) తెలంగాణను తాకాయి. నాగర్‌కర్నూలు, గద్వాల, నల్గొండ, మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం తెలంగాణలో రుతుపవనా లు చురుగ్గా కదులుతున్నాయి.
సాధారణంగా జూన్ రెండో వారంలో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి. కానీ ఈ సారి వారం ముందుగానే రాష్ట్రంలోకి ఆగమనం జరిగింది. ఈ సారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో పలుచోట్లతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక మంగళవారం( జూన్ 4) నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఖమ్మం, నల్లగొండ,సూర్యాపేట, మహబూబాబాద్,జిల్లాలతో పాటు...రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. కాగా ఆదివారం ( జూన్ 2) హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి