నైరుతి రుతుపవనాలు ముంబయిని తాకడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు వెదర్ కూల్ గా మారిపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గత రెండు రోజుల నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉరుమలు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ముంబయిపై నైరుతి ప్రభావం మొదలైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే కొద్ది రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. త్వరలో పశ్చిమబెంగాల్, జార్ఘండ్ రాష్ట్రాల్లో కూడా నెమ్మదిగా నైరుతి పవనాలు విస్తరిస్తాయని న్యూఢిల్లీలోని నేషనల్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ హెడ్ ఆర్‌కె జెనామణి అన్నారు. ఈ ఏడాది సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ అంచనాల నేపథ్యంలో, బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది.