వారంలో రాష్ట్రానికి రుతుపవనాలు

  • 4 రోజుల్లో తేలికపాటి వర్ష సూచన

హైదరాబాద్: రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. దాంతో ఖరీఫ్ సీజన్ కాస్త ముందుగానే జోరందుకోనుంది. వచ్చే 5 రోజులు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరిలోనూ వానలు పడుతాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది.
3రోజుల ముందుగానే కేరళ తీరం తాకిన నైరుతి రుతిపవనాలు
రైతులకు శుభవార్త చెప్పింది భారత వాతావరణ శాఖ. అనుకున్న తేదీ కంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది. మే 27 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని మొదట భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత జూన్ 1న కేరళలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. అయితే వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగా కాకుండా నిన్ననే తీరాన్ని తాకాయి. ఈ సీజన్ లో మూడు రోజుల ముందుగానే కేరళ తీరాన్ని తాకాయని వాతావరణశాఖ ప్రకటించింది.  
మరో రెండు మూడు రోజుల్లో కేరళ రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరిస్తాయని ఐఎండి అంచనా వేసింది. వాతావరణంలో ఏవైనా అనూహ్య మార్పులు జరిగినా, గాలుల దిశ, ఉపరితల ఆవర్తనాల ఎఫెక్ట్ ఉంటే కాస్త ఆలస్యమవుతాయని తెలిపారు వాతావరణశాఖ అధికారులు. రెండు మూడ్రోజుల్లో తమిళనాడు, కర్నాటకలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చేనెల 7 లేదా 8 తేదీల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందంటున్నారు. గతేడాది జూన్ 5న నైరుతి పవనాలు రాష్ట్రమంతా విస్తరించిన విషయం తెలిసిందే. . 
అరేబియా సముద్రం నుంచి వస్తున్న గాలులు, ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని తెలిపారు అధికారులు. అలాగే వచ్చే 5 రోజులు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, పుదుచ్చేరిలోనూ వానలు పడతాయన్నారు. అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు ఆవరించి ఉన్నాయని.. అవి మరింత ముందుకు కదులుతున్నట్లు తెలిపారు.


అక్కడక్కడ పడుతున్న వర్షాలు
ఇటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ వర్షం పడటంతో రైల్వే స్టేషన్ దగ్గరలో పెద్ద చెట్టు కూలి కిందపడింది. వేప చెట్టు ఆటో పై పడటంతో ఆటో ధ్వంసమైంది. ఆ టైంలో చెట్టుకింద ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. మరోవైపు జిల్లాలో కురిసిన వర్షానికి ఇళ్లపై కప్పులు లేచి పోయాయి. ఈదురుగాలులకు జిల్లా గ్రంథాలయం పైకప్పు లేచిపోయింది. దీంతో లైబ్రరీలో ఉన్న పుస్తకాలు వర్షానికి తడిసిపోయాయి. ఈదురుగాలుల ధాటికి కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లపై చెట్టు విరిగిపడ్డాయి. రాత్రి హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. 

 

ఇవి కూడా చదవండి

సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం

కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్యం చేసినందుకు..

ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే చికిత్స