హైదరాబాద్ లో ఫేక్ సర్టిఫికెట్ల దందా

  • ఓల్డ్ సిటీలో ఫేక్ సర్టిఫికెట్ల దందా
  • ముగ్గురిని అరెస్ట్ చేసిన టాస్క్‌‌‌‌ఫోర్స్ పోలీసులు
  • 40 ఫేక్ సర్టిఫికెట్లు, కారు స్వాధీనం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :ఫేక్ సర్టిఫికెట్లు అమ్ముతున్న ముగ్గురిని మంగళవారం సౌత్‌‌‌‌జోన్ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన 40  ఫేక్ సర్టిఫికెట్లు, కారు‌‌‌‌, రూ.40 లక్షల విలువైన ప్లాట్‌‌‌‌ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సౌత్‌‌‌‌జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వేమినేని నాగార్జున(33) హైదరాబాద్​కు వచ్చి చైతన్యపురిలో అర్జున అకాడమీ ఏర్పాటు చేశాడు. ఓపెన్‌‌‌‌ స్కూల్స్‌‌‌‌, డిస్టెన్స్‌‌‌‌ పరీక్షలు  రాసేవారికి క్లాసెస్‌‌‌‌ నిర్వహించేవాడు. 2019లో గుంటూరు జిల్లాకు చెందిన గోపిరెడ్డి జ్యోతిరెడ్డి(40)తో కలిసి  ఫేక్ సర్టిఫికెట్ల దందాకు  ప్లాన్ చేశాడు. న్యూ నల్లకుంటకు చెందిన మొగుళ్ల నరేశ్(32)ను మధ్యవర్తిగా పెట్టి సర్టిఫికెట్లు అమ్మడం మొదలుపెట్టాడు.

ఢిల్లీ, కోల్ కతా నుంచి తెప్పించుకుని..

నాగార్జున, జ్యోతిరెడ్డి, నరేశ్ ముగ్గురూ కలిసి వెస్ట్‌‌‌‌ బెంగాల్​లోని కోల్‌‌‌‌కతాకు చెందిన అరవింద్‌‌‌‌, ఢిల్లీకి చెందిన చిన్మయి బిశ్వాస్‌‌‌‌ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రా యూనివర్సిటీతో పాటు తమిళనాడుకు చెందిన అన్నామలై, అన్నా యూనివర్సిటీస్‌‌‌‌ సహా 23 రకాల యూనివర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లు సప్లయ్ చేస్తున్నారు. డిమాండ్‌‌‌‌ను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ పోలీసులకు అందిన సమాచారంతో అడిషనల్ డీసీపీ ఏవీఆర్ నర్సింహా రావు టీమ్‌‌‌‌ ఓల్డ్‌‌‌‌ సిటీలోని మీర్‌‌‌‌‌‌‌‌చౌక్‌‌‌‌లో రెయిడ్స్ చేసింది. నాగార్జున, జ్యోతిరెడ్డి, నరేశ్​ను అరెస్ట్ చేసింది. ఫేక్ సర్టిఫికెట్లు, కారు‌‌‌‌, ప్లాట్‌‌‌‌ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది. సర్టిఫికెట్స్ సప్లయర్స్‌‌‌‌ అరవింద్, బిశ్వాస్‌‌‌‌ కోసం గాలిస్తున్నారు.