కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లాలో సోయా రైతులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. భారీ వానలకు పంట దెబ్బతిని దిగుబడులు తగ్గి తే, పంట చేతికి రాగానే రేటు లేక మరింత నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకాలం సీజన్లో కామారెడ్డి జిల్లాలో 89,100 ఎకరాల్లో సోయా పంటను సాగు చేశారు. నిరుడు 71వేల ఎకరాల్లో పంట వేయగా ఈసారి 18వేల ఎకరాల విస్తీర్ణం పెరిగింది. పత్తికి బదులుగా ఈసారి చాలామంది రైతులు సోయా వేశారు. గాంధారి, జుక్కల్, మద్నూర్, సదాశివనగ్, తాడ్వాయి, రాజంపేట, బిచ్కుంద మండలాల్లో అధిక విస్తీర్ణంలో సోయా ఉంది.
వరుసగా గత రెండేండ్లుగా సోయాతో ప్రతికూల పరిస్థితులు చూస్తున్న రైతులకు ఈసారీ అదే పరిస్థితి ఏర్పడింది. భారీ వానలు పంట దిగుబడులపై ప్రభావం చూపాయి. రేగడి నేలల్లో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల మధ్య, ఇతర నేలల్లో 6 నుంచి 8 క్వింటాళ్ల మధ్య దిగుబడి రావాలి. కానీ, ఈసారి రేగడి నేలల్లో 6 క్వింటాళ్లు, ఇతర నేలల్లో 4 క్వింటాళ్లకు మించి రాలేదని రైతులు తెలిపారు. ఎక్కువ రోజులు చేనులో వర్షం నీళ్లు నిల్వ ఉండటంతో పంట కుళ్లిందని, విత్తులు కూడా రాలిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే చాలా ఏరియాల్లో సోయా కోతలు షురూ అయ్యాయి.
తగ్గించి కొంటున్రు..
సోయాకు గవర్నమెంట్ మద్దతు రేట్ క్వింటాల్‌కు రూ.4,300 ప్రకటించింది. కోతలు జరిగి పంట అమ్మకానికి వస్తున్నప్పటికీ ఇప్పటికీ గవర్నమెంట్ కొనుగోలు సెంటర్లు ఓపెన్ కాకపోవడంతో వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. నిరుడు మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు కూడా వ్యాపారులు కొన్నారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.4వేలకు మాత్రమే కొంటామని చెబుతున్నారని రైతులు అంటున్నారు. నిరుడు క్వింటాల్‌కు రూ.5వేల వరకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. దిగుబడులు తగ్గటం, ఇటు పంట చేతికి రాగానే వ్యాపారులు రేట్ తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. పంట పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రేటు తక్కువకు అడుగుతున్రు
ఈసారి వ్యాపారులు సోయా తక్కువ రేటుకు అడుగుతుంన్రు. నేను 3 ఎకరాల్లో సోయా వేసిన . దిగుబడి కూడా తక్కువగా వచ్చింది. నిరుడు క్వింటాల్‌కు రూ.5వేల వరకు కొన్నారు. ఈ సారి మాత్రం క్వింటాల్‌కు రూ.4వేల రేట్‌కు కొంటామని చెబుతుంన్రు. ధర ఎక్కువగా ఉంటే రైతులకు లాభం ఉంటుంది.
- గోవర్ధన్, వండ్రికల్ తండా
భారీ వానలతో నష్టం
భారీ వానలు పండటంతో సోయా దెబ్బతింది. ఎకరాకు 8 క్వింటాళ్ల దాక వచ్చే సోయలు ఈసారి నాలుగైదు క్వింటాళ్లు కూడా రావట్లే. ఎకరాలకు రూ. 16 వేల దాక ఖర్చయ్యింది. రేట్ ఎక్కువ ఉంటే రైతులకు ఏమైనా లాభం.
- ఇందల్ సింగ్, గాంధారి