ఆదిలాబాద్‌ జిల్లాలో..ఆగిన సోయా కొనుగోళ్లు 

  • ఆలస్యంగా పంట ఎందుకు కొంటున్నారని జిల్లా అధికారులకు కేంద్రం లేఖ 
  • అర్ధాంతరంగా కొనుగోలు నిలిపివేత  
  • మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్న రైతులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్‌ జిల్లాలో సోయా కొనుగోళ్లు ఆగిపోయాయి.  ఈ నెల 24న పట్టణ కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా మూడు రోజులకే కొనుగోళ్లను నిలిపివేశారు.   నాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో సోయా కొనుగోళ్లు చేపట్టారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా సోయా కొనుగోళ్లను  నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  ఇప్పటికే సోయా పంట చేతికొచ్చి 90  రోజులు పూర్తయిందని, ఈ సమయంలో ఎలా కొనుగోళ్లు చేపడతారని అధికారులకు పంపిన లేఖలో ప్రశ్నించింది.  

వెంటనే దీనికి కారణాలు చెప్పాలని, అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలంటూ ఆదేశించింది.  అయితే జిల్లా రైతుల కోరిక మేరకే  నాఫెడ్ సంస్థ సోయా కొనుగోళ్లకు ముందుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు.  దీనిపై  కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇస్తామని, వారం రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మార్క్ ఫెడ్‌ అధికారులు హామీ ఇస్తున్నారు.  ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ. 4  వేలకు తక్కువ కొనుగోళ్లు జరుపుతుండటంతో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని,  ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

లక్ష ఎకరాల్లో సాగు..

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది లక్ష ఎకరాల్లో సోయాబిన్ సాగు చేశారు.  దాదాపు 8 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వచ్చింది.  పంట చేతికొచ్చిన ప్రారంభంలో మద్దతు ధర కంటే మార్కెట్‌లో ఎక్కువ ధర ఉండటంతో ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టలేదు. ఈ క్రమంలో చాలా మంది రైతులు ధర పెరుగుతుందనే ఉద్దేశంతో పంటను నెల రోజులుగా ఇంట్లోనే  నిల్వ చేసుకున్నారు.  ధర పడిపోవడంతో పంటను అమ్ముకునేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు అధికారులకు విన్నవించారు.  సమస్యను గుర్తించి ప్రభుత్వం ఈనెల 24  నుంచి మార్చి 5 వరకు నాఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో సోయాబీన్‌ కొనుగోళ్లు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.  

దాదాపు 40 శాతం మంది రైతులు పంటను ఇంకా విక్రయించాల్సి ఉంది. 1.50 లక్షల క్వింటాళ్ల వరకు పంట రైతుల వద్ద ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.  మద్దతు ధర రూ. 4,600 చెల్లించాలని నిర్ణయించి కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. కానీ అర్ధంతరంగా పంట కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. 

120 క్వింటాళ్ల పంట తీసుకొచ్చిన..

ధర పెరుగుతుందనే ఉద్దేశంతో  కొన్ని రోజులుగా పంటను నిల్వ చేసుకున్నం.  ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పంటను మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాం.  మద్దతు ధర రూ. 4600 వస్తుందని ఆశించినప్పటికీ అధికారులు కొనుగోళ్లు అర్ధంతరంగా నిలిపివేశారు.  మార్కెట్‌కు తెచ్చిన  తర్వాత పంటను తీసుకెళ్లమంటే నష్టపోతాం.

అనిల్ రెడ్డి, రైతు పిప్పలకోటి 

కొనుగోళ్లు వాయిదాపడ్డాయి

సోయాబీన్ పంట కొనుగోళ్లు తాత్కాలికంగా వాయిదా వేశాం.  కేంద్ర ప్రభుత్వం పంట కొనుగోళ్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది.  పంట కోత దశ ముగిసిపోయి 90 రోజుల తర్వాత కొనుగోళ్లు చేపట్టడంపై వివరణ అడిగింది.  జిల్లా ఉన్నతాధికారులతో చర్చలు జరిపి కేంద్రానికి నివేదిక పంపిస్తాం.  వారం రోజుల్లో మళ్లీ ప్రారంభమయ్యేలా చూస్తాం. 

ప్రవీణ్ రెడ్డి, మార్క్‌ఫెడ్‌, డీఏం