కాంగ్రెస్​లోకి సోయం బాపూరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి!

  • బాపూరావు ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీన్.. తాజాగా  అమిత్ షా మీటింగ్​కు ఎంపీ డుమ్మా
  • నల్గొండలో కారు దిగేందుకు సిద్ధమైన గుత్తా సుఖేందర్​రెడ్డి.. సీఎం అడ్వైజర్​ వేం నరేందర్​రెడ్డితో అమిత్​ భేటీ
  • ఆదిలాబాద్​, భువనగిరి టికెట్లపై క్లారిటీ కోసం నేతల ఎదురుచూపులు

ఆదిలాబాద్, వెలుగు :  ఆదిలాబాద్​ సిట్టింగ్ ఎంపీ  సోయం బాపురావు కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొన్నాళ్లుగా ఇంటిపోరు, సీనియర్లతో విభేదాలతో సతమతమవుతున్నప్పటికీ తనకే టికెట్​వస్తుందన్న ధీమాలో ఉన్న సోయం బాపూరావు ఇటీవల తరుచూ ఢిల్లీ వెళ్లి  బీజేపీ పెద్దలను కలిసివస్తున్నారు. సోమవారం కూడా ఢిల్లీ వెళ్లి కమలం పార్టీలోని అగ్రనేతలను కలిసిన సోయం బాపూరావుకు టికెట్​పై హామీ దక్కలేదని తెలుస్తోంది. దీనికితోడు అనూహ్యంగా బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ గొడం నగేశ్​ బీజేపీలో చేరడంతో డైలమాలో పడిన బాపురావు కాంగ్రెస్ ​నేతలతో టచ్​లోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే  మంగళవారం హైదరాబాద్ లో జరిగిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మీటింగ్​కు డుమ్మా కొట్టడం గమనార్హం.

కాంగ్రెస్ ​నేతలతో మంతనాలు.. 

బీజేపీ టికెట్​ రాదని స్పష్టమైన సంకేతాలు రావడంతో సోయం హైదరాబాద్ ​కేంద్రంగా కాంగ్రెస్​ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్​ టికెట్ ​కేటాయిస్తే కాంగ్రెస్​లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది.  ఆదివాసీల్లో బలమైన నేతగా సోయంకు గుర్తింపు ఉంది.  ఒకవేళ బీజేపీ సోయంకు బదులు ఆదివాసీ తెగకే చెందిన నగేశ్​కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో సోయంను బరిలోకి దించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆయనకు కలిసివచ్చే అంశం. 

బీజేపీలో ముసలం..

ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలతో అస్త్యవస్తంగా మారిన ఆదిలాబాద్​ బీజేపీలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత గొడం నగేశ్ ​చేరిక మరింత కల్లోలం రేపుతోంది.  నగేశ్​కు బీజేపీ ఎంపీ టికెట్ వస్తుందనే ప్రచారంతో ఆ పార్టీ టికెట్​ఆశిస్తున్న రాథోడ్ రమేశ్, జాదవ్ రాజేశ్ బాబు, జెడ్పీ చైర్మెన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తదితరులు  ఢిల్లీ బాటపట్టారు.  బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, ఇతర నేతలను కలిసి కొత్తగా వచ్చిన నగేశ్​కు కాకుండా తమలో ఒకరికే ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది.  

బీజేపీ సీనియర్​ లీడర్​, ఆదిలాబాద్​ ఎంపీ సోయం బాపూరావు, శానసమండలి చైర్మన్, బీఆర్ఎస్​ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కొడుకు అమిత్ రెడ్డి కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమయ్యారు. కొద్దిరోజులుగా సొంత జిల్లాల్లో ఇంటిపోరును ఎదుర్కొంటున్న ఈ ముగ్గురు నేతలు, టికెట్లపై క్లారిటీ రాకపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఆదిలాబాద్ ​టికెట్​ కోసం సోయం, భువనగిరి టికెట్​ కోసం అమిత్​రెడ్డి హైదరాబాద్​లో మకాం వేసి పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతుండడం ఆసక్తి రేపుతోంది.