అర్హులందరికీ కేంద్ర పథకాలు అందాలి : సోయం బాపురావు

ఆదిలాబాద్/సారంగాపూర్, వెలుగు: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో 2047 నాటికి భారత్​ను అగ్రస్థానంలో నిలపడమే ‘వికసిత్ భారత్’ లక్ష్యమని ఆదిలాబాద్​ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని సూచించారు. బుధవారం ఆదిలాబాద్ అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఆయన ప్రారంభించారు. 

కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం సంతోషకరం అన్నారు. కేంద్ర పథకాలను వివరించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్​భారత్ సంకల్ప యాత్రను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్​రెడ్డి ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం దుప్యతండాలో వర్చువల్​గా వీక్షించారు.