ఉమ్మడి ఆదిలాబాద్ సోయా నకిలీ విత్తనాలు కలకలం రేపుతున్నాయ్. జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో సోయా విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో మరోసారి విత్తనాలు విత్తుకుంటున్నారు రైతులు. అయితే ఖరీఫ్ మొదట్లోనే భారీగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు.
ఎకరాకు 5వేలు ఖర్చు చేశాం..
దుక్కి దున్ని.. విత్తనాలు వేసేందుకు ఎకరాకు 5వేలు ఖర్చు చేసి విత్తుకున్నామని.. అయితే తొలకరి వర్షాలకు విత్తనం మొలకెత్తకపోవడంతో.. మళ్లీ దుక్కి దున్ని కొత్త విత్తనాలు.. లేదా కొత్త పంట వేసుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సన్న.. చిన్నకారు రైతులంతా సోయా పంట వేసుకుని 8 రోజులు దాటినా మొలకెత్తలేదన్నారు. ఇదే విషయాన్ని సైంటిస్టుల దృష్టికి తీసుకెళితే వారు వచ్చి చూసి వెళ్లారే తప్ప ఎలాంటి సమాధానం లేదన్నారు. తాము నష్టపోయిన విషయాన్ని స్థానిక నేతలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లామని.. తమకు విత్తనాలు అమ్మిన డీలర్ ను ప్రశ్నించినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.