
- సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైనం
- ఈ తరహా పోస్టులపై పోలీసుల ఉక్కుపాదం
- తల్వార్లతో పోస్టులు చేసిన పలువురిపై కేసులు నమోదు
- తాజాగా రౌడీషీటర్లతో ఎస్పీ ‘రౌడీ మేళా’ ఏర్పాటు
ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో పోకిరీలు రెచ్చిపోతున్నాయి. ‘దేకో మేర రౌడీయిజం’ అన్నట్లుగా సోషల్ మీడియాను వేదికగా పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోస్టులు పెడుతున్నారు. కత్తులు పట్టుకొని ఫొటోలు దిగుతూ, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. రోడ్లపై చాకులతో తిరుగుతూ వీడియోలు తీస్తున్నారు. వాటిని ఇన్స్టాగ్రాం, వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో పెడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో రౌడీ మూకలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
- ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన షేక్ సలీం అలియాస్ కైంచీ సలీం అనే యువకుడు ఈనెల 13న కత్తులు నోట్లో పెట్టుకొని, ప్రదర్శనలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు చేశాడు. అవి ప్రజలను భయపెట్టే తరహాలో ఉండడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సలీం ఇప్పటికే ఏడు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.
- ఫిబ్రవరి 24న ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతి నగర్ వద్ద జరిగిన హత్య కేసు గురించి నేరస్తులకు అనుకూలంగా కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్ కు చెందిన కొత్తూరి సాయివర్ధన్, కావలే ఆశిష్, కొచ్చాడే నీలేశ్అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. దీంతో ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ ముగ్గురికి గంజాయి పరీక్ష చేయగా సాయివర్ధన్, ఆశిష్ గంజాయి తాగిన్నట్లు నిర్ధారణ అయ్యింది.
- బుధవారం రాత్రి తల్వార్లతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఇద్దరిపై ఇచ్చోడ సీఐ భీమేశ్ కేసు నమోదు చేశారు. గుడిహత్నూర్ మండలం మహంకాళి ఆలయం వద్ద సునీల్, తరుణ్ అనే యువకుల పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇద్దరు వ్యక్తులు ముండే వెంకట్, నరేశ్ తల్వార్లతో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. తల్వార్లతో దిగిన ఫొటోలు భయభ్రాంతులకు గురిచేసేలా ఉండటంతో ఆ ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
జిల్లాలో రౌడీయిజాన్ని కనుమరుగు చేస్తాం
జిల్లాలో రౌడీలు రెచ్చిపోతున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. జిల్లాలో రౌడీయిజాన్ని కనుమరుగు చేస్తామని, రౌడీ ప్రవర్తన మార్చుకోకపోతే అణచివేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గురువారం ఉదయం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ డివిజనల్ పరిధిలోని రౌడీషీటర్లతో రౌడీ మేళా సమావేశం నిర్వహించారు. సత్ప్రవర్తనతో ఉంటే వారిపై రౌడీషీట్లు తొలగిస్తామన్నారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, రౌడీయిజం చేయడం లాంటివి మానుకోవాలని హెచ్చరించారు.
రౌడీలపై ఉన్న కేసుల వివరాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో కత్తులతో పోస్టులు పెట్టడం, రెచ్చగొట్టడం, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్ రావు, సాయినాథ్, ఫణిధర్ పాల్గొన్నారు.
సోషల్ మీడియాలో షో చేస్తుండ్రు..
సోషల్ మీడియాలో అసాంఘిక కార్యకలాపాలకు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. జిల్లాలో ఎప్పుడు లేనవిధంగా నేరాలు చేస్తామని సోషల్ మీడియాను మిస్ యూజ్ చేస్తూ రీల్స్ చేస్తుండటంతో ప్రజలను భయందోళనకు గురిచేస్తోంది. సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై దృష్టి పెట్టి పోకిరీలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆపరేషన్ ఛబ్రుత పేరుతో అర్ధరాత్రి రోడ్లపై సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నారు.