సిరిసిల్ల టౌన్/వేములవాడ, వెలుగు: ప్రభుత్వ రూల్స్‌కు అనుగుణంగా జిల్లాలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం సిరిసిల్ల, వేములవాడలో వివిధ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, గణేశ్ మండపాల నిర్వాహకులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో నవరాత్రి వేడుకలు జరుపుకోవాలన్నారు.
మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని, ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద మందు తాగడం, అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల ఆర్డీవో రమేశ్, మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసత్ అలీ బేగ్, డీపీవో వీరబుచ్చయ్య, సీఐలు కృష్ణ, శ్రీనివాస్, మొగిలి, వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు పాల్గొన్నారు.