పాత కక్షలు, భూ తగాదాలతోనే గంగారెడ్డి హత్య: ఎస్పీ అశోక్ కుమార్

పాత కక్షలు, భూ తగాదాలతోనే గంగారెడ్డి హత్య: ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‎లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు, కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కేసులో నిందితుడు సంతోష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల పాలిటిక్స్‎లో కాకరేపిన ఈ మర్డర్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం (అక్టోబర్ 25) ఎస్పీ పేరిట పోలీసులు మీడియాకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ ప్రెస్ నోట్‎లో కీలక విషయాలు వెల్లడించారు. పాత కక్షలు, భూతగాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. 

ఈనెల (అక్టోబర్) 22న ఉదయం అద్దెకు తెచ్చిన కారుతో బండిమీద వెళుతున్న గంగారెడ్డిని ఢీ కొట్టి, ఆ తర్వాత కత్తితో విచక్షణ రహితంగా పొడిచి సంతోష్ చంపేశాడని పేర్కొన్నారు. నిందితుని ఆనవాళ్లు సీసీ కెమెరాల్లో గుర్తించడంతో పాటు స్థానికుల సాక్ష్యం ఆధారంగా ఇవాళ సంతోష్‎ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. సంతోష్ కుటుంబానికి, వారి బంధువుతో కొద్దిరోజులుగా భూ వివాదాలు ఉన్నాయని.. ఈ వివాదంలో సంతోష్‎కు వ్యతిరేకంగా బంధువులకు మద్దతుగా గంగారెడ్డి ఉన్నాడని.. దీనితో గంగారెడ్డిపై సంతోష్ కక్ష పెంచుకున్నాడన్నారు. 

ALSO READ | పాత కక్షలా.. రాజకీయ హత్యనా ? : గంగారెడ్డి హత్యపై పోలీసుల ఫుల్ ఎంక్వైరీ

గతంలో సంతోష్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కాగా ఈనెల 25 నుంచి అది కోర్టులో హియరింగ్‎కు  రానుందని.. ఈ కేసు వెనక కూడా గంగారెడ్డి ఉన్నాడని భావించి అతనితో కాంప్రమైజ్ కోసం కొద్ది రోజుల క్రితం సంతోష్ చర్చలు జరిపారని వివరించారు. ఈ విషయంలో సంతోష్ విజ్ఞప్తిని గంగారెడ్డి తిరస్కరించడంతో పాటు తిట్టాడని.. దీంతో గంగారెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని సంతోష్ మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలిపారు. హత్యకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చిన సంతోష్.. ఈనెల 22న ఉదయం హత్య చేశాడని వెల్లడించారు.