
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోలీస్ కుటుంబాలకు డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని ఎస్పీ బి.రోహిత్ రాజు భరోసా ఇచ్చారు. పలువురు పోలీసులు ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో మృతి చెందగా.. వారి కుటుంబాలకు చేయూత, భద్రతా ఎక్స్గ్రేషియా ఫండ్స్ నుంచి ఆర్థిక సాయాన్ని కొత్తగూడెం ఎస్పీ ఆఫీస్లో సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడారు.
కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ భద్రాచలంలో విధి నిర్వహణలో కాలు జారీ కాల్వలో పడి హెడ్ కానిస్టేబుల్ పి. శ్రీదేవి, కొమరారం పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ అనారోగ్య కారణాలతో హెడ్ కానిస్టేబుల్ ఎం. సైదేశ్వరరావు మృతి చెందారని తెలిపారు. ఆయా కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 8లక్షల చొప్పున అందజేశామన్నారు.
టేకులపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్సై బి. కృష్ణ కుటుంబానికి రూ. లక్ష అందజేశామని తెలిపారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. ఈ ప్రోగ్రాంలో ఎస్పీ ఆఫీస్ సూపరింటెండెంట్ సత్యవతి, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.