పోలీసుల కోసం స్పెషల్​ గ్రీవెన్స్

పోలీసుల కోసం స్పెషల్​ గ్రీవెన్స్
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సిబ్బంది సమస్యలను ప్రతి గురువారం తెలుసుకునేలా ఎస్పీ ప్లాన్​
  • ఇటీవల జిల్లాలో ముగ్గురి పోలీసుల సూసైడ్​ నేపథ్యంలో నిర్ణయం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల కోసం ప్రతి గురువారం ప్రత్యేకంగా గ్రీవెన్స్​నిర్వహించేందుకు ఎస్పీ బి.రోహిత్​ రాజు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. వంద రోజుల్లో ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్​ సూసైడ్​ చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్​ అధికారులు, సిబ్బందిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్​ ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. 

వారంలో రెండు రోజులు గ్రీవెన్స్..

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల పాటు గ్రీవెన్స్​ నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​లో ప్రజల కోసం ఇప్పటికే గ్రీవెన్స్​ నిర్వహిస్తే, ఇప్పుడు జిల్లా పోలీస్​ ఆఫీసర్లు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా ప్రతి గురువారం గ్రీవెన్స్​ నిర్వహించనున్నారు. పోలీస్​ అధికారులు, సిబ్బంది ఎవరైనా గ్రీవెన్స్​రోజు తనను నేరుగా కలిసి సమస్యలను విన్నవించుకోవచ్చని ఎస్పీ స్పష్టం చేశారు. చిన్న సమస్యలకే కొందరు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అలాంటి వారికి ఈ గ్రీవెన్స్​ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. 

ఎస్పీ టెలీ కాన్ఫరెన్స్​ 

కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​ నుంచి మంగళవారం జిల్లాలో పోలీస్​ ఆఫీసర్లు, సిబ్బందితో ఎస్పీ టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల జరిగిన ఘటనలు తనను ఎంతగానో బాధించాయన్నారు. కుటుంబాల కోసం ఆలోచించకుండా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం బాధకరమని చెప్పారు. పోలీస్​ శాఖలో పని చేసే ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలన్నారు. నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీస్​శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మావోయిస్టు కార్యక్రమాలను అడ్డుకోవడం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో రాష్ట్రంలోనే జిల్లా పోలీస్​లకు మంచి పేరుందన్నారు. ఈ క్రమంలో పలు సమస్యలను సిబ్బంది ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.