- భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్‌రాజు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ఆఫీసర్లను ఎస్పీ బి. రోహిత్ రాజు ఆదేశించారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్‌లో మంగళవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. దొంగ తనం కేసుల్లో చోరీ అయిన సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు.
కొత్త కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను మాయం చేస్తున్నారన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నేరస్థులకు శిక్ష పడేలా చూడాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు సప్లై చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
రౌడీషీటర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. పోలీస్ ఆఫీసర్లు కింది స్థాయి సిబ్బంది ఒత్తిడిని తగ్గించుకునేలా అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీఎస్పీలు చంద్రభాను, రెహమాన్, సతీశ్ కుమార్, రవీందర్‌రెడ్డి, మల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఎస్సై స్వప్నను అభినందించిన ఎస్పీ..
రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ఫింగర్ ప్రింట్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన చంద్రుగొండ ఎస్సై స్వప్నను ఎస్పీ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీమీట్‌లో బంగారు పతకం సాధించిన పోలీస్ జాగిలం జూనోతో పాటు హ్యాండ్లర్ హుస్సేన్‌కు కూడా అభినందనలు తెలిపారు.