ఉద్యోగాల పేరుతో మోసం.. పది మంది అరెస్ట్ : ఎస్పీ రోహిత్​ రాజు

ఉద్యోగాల పేరుతో మోసం.. పది మంది అరెస్ట్ : ఎస్పీ రోహిత్​ రాజు
  • రూ.1.47 కోట్లు స్వాధీనం
  • బ్యాంకులో కుదువపెట్టిన 92 తులాల బంగారం రికవరీకి చర్యలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణితో పాటు పలు గవర్నమెంట్​ ఉద్యోగాలు ఇప్పిస్తామని, బదిలీలు  చేపిస్తాని మోసం చేసిన కేసులో 10 మందిని అరెస్ట్​ చేసినట్లు భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి.రోహిత్​ రాజు తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్​కు చెందిన దాసు హరికిషన్, ఆయన భార్య హారిక, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలానికి చెందిన గుండా వినోద్​కుమార్, యూ ట్యూబ్​ ఛానల్​ రిపోర్టర్​గా చెప్పుకుంటున్న ఉపేంద్ర నాయుడు కలిసి నిరుద్యోగులను మోసం చేసి డబ్బులు వసూలు చేశారని తెలిపారు.

2018 నుంచి ఇప్పటి వరకు జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని నిరుద్యోగులను మాయమాటలు చెప్పి ఉద్యోగాల పేరుతో మోసం చేసి దాదాపు రూ.4 కోట్ల మేర డబ్బులు వసూలు చేసినట్లు చెప్పారు. సింగరేణిలో క్లర్క్​ ఉద్యోగాలు, డిపెండెంట్, గవర్నమెంట్​లో గ్రూప్–2, ఏసీటీవో ఉద్యోగాలతో పాటు ట్రాన్స్​ఫర్స్​ చేపిస్తామంటూ పెద్ద ఎత్తున వసూలు చేశారన్నారు. ఇప్పటి వరకు 60 మంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాతో పాటు గోదావరిఖని ఏరియాలో 8 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆర్అండ్​బీ డీఈ పేరుతో ఫేక్​ ఐడీ కార్డు సృష్టించుకొని దాసు హరికిషన్​ ఈ దందా నడిపించగా, గుండా వినోద్​ కుమార్​ నిరుద్యోగులను కలిపించడంలో కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు.

నిందితురాలు హారికను అరెస్ట్​ చేసి రూ. 1.47 కోట్ల నగదు, నాలుగు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బులతో 92 తులాల బంగారాన్ని కొని బ్యాంకులో కుదువ పెట్టి లోన్​ తీసుకున్నారని, ఆ బంగారాన్ని రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రవీణ్ ను ఎస్పీ అభినందించారు.