- పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అప్పగింత
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న 220 ఫోన్లను రికవరీ చేయడంతో పాటు బాధితులకు అప్పగించామని ఎస్పీ బి. రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో బాధితులకు ఫోన్లను ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేస్తున్నామన్నారు. ఎవరైనా తమ ఫోన్లను పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా కంప్లైంట్ చేయాల్సి ఉంటుందన్నారు.
గత నెల రోజుల వ్యవధిలో 220 మంది బాధితులకు పోగొట్టుకున్న ఫోన్లను అందజేశామని తెలిపారు. ఫోన్ల రికవరీలో కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పోయిన ఫోన్లు దొరకవని అనుకున్న టైంలో పోలీసులు వెతికి పట్టుకొని తమకు ఇప్పించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రోగ్రాంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఐటీ సెల్ ఇన్చార్జి సీఐ నాగరాజు రెడ్డి, ఐటీ సెల్ మెంబర్స్విజయ్, రాజేశ్, నవీన్, మహేశ్ పాల్గొన్నారు.