శ్రీరామనవమి ఉత్సవాలకు భారీ బందోబస్తు : ఎస్పీ రోహిత్​ రాజు

శ్రీరామనవమి ఉత్సవాలకు భారీ బందోబస్తు : ఎస్పీ రోహిత్​ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ బి.రోహిత్​ రాజు తెలిపారు. హేమచంద్రాపురంలోని పోలీస్​హెడ్ క్వార్టర్స్​లో బుధవారం నిర్వహించిన క్రైం రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. భద్రాచలం, పర్ణశాలల్లో శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా ముందస్తు బందోబస్తు ప్లాన్ చేయాలన్నారు. 

రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాలని, పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్​ఆఫీసర్లు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్​సింగ్, డీఎస్పీలు చంద్రభాను, రెహమాన్, రవీందర్, సతీశ్ కుమార్, మల్లయ్య స్వామి పాల్గొన్నారు.