కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి : ఎస్పీ బి. రోహిత్​రాజు

కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి : ఎస్పీ బి. రోహిత్​రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న మూడు కొత్త క్రిమినల్​ చట్టాలపై పోలీస్​ అధికారులు, సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ బి. రోహిత్​ రాజు సూచించారు. కొత్తగూడెంలోని ఉమెన్స్​ కాలేజీలో మంగళవారం కొత్తగూడెం సబ్​ డివిజన్​ పోలీసుల ఆధ్వర్యంలో మూడు కొత్త చట్టాలపై ఏర్పాటు చేసిన ట్రైనింగ్​క్యాంప్​ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు కొత్త చట్టాలలో సమకాలీన కాలంతో పాటు వాడుకలో ఉన్న సాంకేతికతకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చినట్లు వెల్లడించారు.

ఈ కొత్త చట్టాలకు 2023 డిసెంబర్​ 21న పార్లమెంట్​లో ఆమోదం లభించిందన్నారు. రాష్ట్రపతి నుంచి కూడా అనుమతి వచ్చిందని తెలిపారు. కొత్త చట్టాలపై ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ ప్రోగ్రాంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్​, ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్​ సింగ్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఎస్బీ ఇన్​స్పెక్టర్​ నాగరాజు, సీఐలు కరుణాకర్, రమేశ, శివప్రసాద్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. 

 నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు 

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బి. రోహిత్​ రాజు హెచ్చరించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​లో అగ్రికల్చర్​ ఆఫీసర్లు, విత్తన డీలర్లతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంచే గుర్తించిన విత్తనాలను మాత్రమే డీలర్లు అమ్మాలని సూచించారు.

 ఎవరైనా నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగు మందులు అమ్మితే సీరియస్​ యాక్షన్​ తీసుకుంటామన్నారు. రైతులను మోసం చేసే దళారులను గుర్తిస్తే వెంటనే పోలీస్​లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులు తాము కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు సంబంధించి తప్పకుండా రసీదులు తీసుకోవాలన్నారు.