గంజాయి రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి

నార్కట్​పల్లి, వెలుగు : ఎవరైనా గంజాయి అమ్మినా.. రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 2023 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు జనావాసానికి దూరంగా నార్కట్ పల్లి మండలం గుమ్మలబావి సమీపంలో నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాలతో మనుషులు శారీరకంగా, మానసికంగా దెబ్బతింటారన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడడంతో రోడ్డు ప్రమాదాలు, ఇతర నేరాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

మత్తు పదార్థాలకు యువత, విద్యార్థులు ఆకర్షితులు కావద్దన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాల గురించి జిల్లాలోని కళాశాలలు, పాఠశాలల్లో  విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు, మానసిక ఆరోగ్యాన్ని గమనిస్తుండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, ఎస్​బీడీఎస్పీ రమేశ్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, డీసీఆర్ బీడీఎస్​పీ సైదా, సీఐలు రాఘవరావు, బీసన్న, సైదులు, నాగరాజు, ఆర్ఐలు సురాప్ప నాయుడు, సంతోష్, ఎస్ఐ అంతిరెడ్డి పాల్గొన్నారు.