సీఎం యోగి ఇంటి కింద శివలింగం ఉందంటే కూల్చేస్తారా..?

సీఎం యోగి  ఇంటి కింద శివలింగం ఉందంటే కూల్చేస్తారా..?

లక్నో: సమాజ్‌‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నోలోని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం కింద శివలింగం ఉన్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వెంటనే అక్కడ తవ్వకాలు జరిపి శివలింగాన్ని వెలికితీయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. "ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ప్రజల దృష్టిని మరల్చడానికి వివిధ ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్నది. 

తవ్వకాలు అనేది అభివృద్ధి కాదు. అదొక విధ్వంసం. సీఎం యోగి  చేతిలో అభివృద్ధి రేఖ బదులు విధ్వంస రేఖ ఉంది. సీఎం నివాసం కింద కూడా శివలింగం ఉందని మేం భావిస్తున్నాం. అక్కడ కూడా తవ్వకాలు జరపాలి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తన బొందను తానే తవ్వుకుంటున్నది" అని  అఖిలేశ్ మండిపడ్డారు.  సంభాల్‌‌లో పురాతన మెట్ల బావి తవ్వకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ సర్కార్ అత్యుత్సాహంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

విరుచుకుపడిన బీజేపీ

అఖిలేశ్ యాదవ్‌‌ చేసిన కామెంట్లపై బీజేపీ మండిపడింది. ‘2013లో అప్పటి అఖిలేశ్ ప్రభుత్వం వెయ్యి టన్నుల బంగారం కోసం తవ్వకాలు చేపట్టింది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్నీ, రాష్ట్రంలోని మెషిన్లను ఉపయోగించి తవ్వకాలు జరిపింది. బంగారం కోసం తవ్వకాలు జరిపేందుకు సిద్ధమయ్యే అఖిలేశ్‎కు శివలింగం కోసం తవ్వకాలు జరిపితే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు’ అంటూ బీజేపీ నేత రాకేశ్ త్రిపాఠి ఫైర్ అయ్యారు.