
మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికల కోడ్ అమలులో భాగంగా మెదక్ జిల్లాలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ బాలస్వామి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ఏడు చెక్‌పోస్టుల్లో ఇప్పటివరకు సరైన ఆధారాల్లేని రూ.21,27,330 నగదును సీజ్‌చేసి ఎన్నికల గ్రీవెన్స్ జిల్లా కమిటీకి అప్పగించినట్లు చెప్పారు. వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగదుతోపాటు రూ. 9.75లక్షల విలువైన 2, 535 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా పరిధిలో ఎవరైనా రూ. 50 వేలకంటే ఎక్కువ డబ్బు తీసుకెళ్లొద్దని ఎస్పీ సూచించారు.