
ముంబై: మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి వైదొలుగుతున్నట్లు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) శనివారం ప్రకటించింది. బాబ్రీ మసీదు కూల్చివేతపై శివసేన(యూబీటీ) ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ చేసిన పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబ్రీ మసీదు కూల్చి 32 ఏండ్లు అవుతోంది. దీన్ని ఉద్దేశిస్తూ ‘ఈ పని చేసిన వారిపట్ల నేను గర్వంగా ఉన్నా’ అంటూ ట్విట్టర్లో మిలింద్ కామెంట్ చేశాడు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఫొటోతో పాటు ఆయన చేసిన కామెంట్లను పోస్టుకు అటాచ్ చేశాడు.
ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రేతో పాటు అతని ఫొటో కూడా అందులో ఉంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ.. ఎంవీఏ నుంచి బయటికి వచ్చినట్లు ప్రకటించింది. దీంతో మహారాష్ట్రలో గెలిచిన ఇద్దరు ఎస్పీ ఎమ్మెల్యేలు.. ఎంవీఏ కూటమి పిలుపును వ్యతిరేకించారు. అందరితో పాటు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే బీజేపీకి, ఎంవీఏకు తేడా ఏముంది అని ఎస్పీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మీ ప్రశ్నించారు. శివసేన(యూబీటీ) ఎమ్మెల్సీ ఇలాంటి కామెంట్లు చేశాక కూటమిలో ఉండలేమని స్పష్టం చేశారు.