
నిర్మల్, వెలుగు: ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా జిల్లా సరిహద్దులోని సిరిపల్లి చెక్‌పోస్ట్‌ను ఎస్పీ జానకి షర్మిల గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద జరుగుతున్న వాహనాల తనిఖీలను పరిశీలించారు. వివిధ చెక్‌పోస్టుల్లో సీజ్ చేసిన నగదు, మద్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సరిహద్దు చెక్‌పోస్టుల్లోని సిబ్బంది నిఘాను విస్తృతం చేయాలని, ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు. తనిఖీల్లో రూ.50 వేలకు పైగా పట్టుబడితే పంచానామా నిర్వహించి జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించాలని సూచించారు. అల్లర్లు సృష్టించే వారిని, పాత నేరస్థులను ముందుగానే గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మల్ రూరల్ సీఐ శ్రీనివాస్ తదితరులున్నారు.
జన్నారం సరిహద్దుల చెక్‌పోస్ట్‌లో ఏసీపీ..
జన్నారం మండలంలోని ఉన్న జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఇందన్ పెల్లి, కలమడుగులోని ఫారెస్ట్ చెక్ పోస్టులను మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాశ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రాకపోకలు సాగించే ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రేండ్లగూడ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట అడిషనల్ ఎస్ఐ సర్కార్ ఉన్నారు.