పారిపోయిన పువ్వర్తి గ్రామస్తులు తిరిగి రావాలి : ఎస్పీ కిరణ్​చవాన్

  •     హిడ్మా తల్లిని కలిసి మాట్లాడిన సుక్మా ఎస్పీ 

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లా పువ్వర్తిలో శనివారం సీఆర్​పీఎఫ్ బేస్​క్యాంప్​ఏర్పాటు చేయగా, ఎస్పీ కిరణ్​చవాన్ ​ఆదివారం గ్రామానికి చేరుకున్నారు. మోస్ట్​వాటెండ్ మావోయిస్ట్ ​అగ్రనేత హిడ్మా ఇంటికి వెళ్లారు. హిడ్మా తల్లిని కలిసి మాట్లాడారు. సీఆర్ పీఎఫ్ బేస్​క్యాంప్​ఏర్పాటు తర్వాత పువ్వర్తి గ్రామస్తులు, మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.

 గ్రామస్తులంతా తిరిగి గ్రామంలోకి రావాలని ఎస్పీ  కిరణ్​చవాన్ కోరారు. గ్రామం భద్రతా బలగాల అదుపులో ఉందని, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హిడ్మాతో పాటు టేకులగూడెం బేస్​క్యాంపు దాడి సూత్రధారి, బెటాలియన్–1 కమాండర్​బార్సే దేవతోపాటు గ్రామానికి చెందిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. గ్రామంలోని వారి కుటుంబ సభ్యులతో చర్చించారు. హిడ్మా, బార్సే దేవ తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు.