కాటారం, వెలుగు: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. గురువారం ఎస్పీ మహాముత్తారం మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది పని తీరు తెలుసుకుని, సాంకేతికంగా వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.
పోలీసులు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం ఎస్సై మహేంద్ర కుమార్ ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయిపై, పేకాట పై ఉక్కుపాదం మోపాలని సూచించారు. కాటారం డీఎస్పీ జి. రామ్మోహన్ రెడ్డి, కాటారం సీఐ నాగార్జున రావు, ఎస్సై మహేంద్ర కుమార్, సీసీ ఫసియొద్దీన్, పోలీసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.