
- ప్రభుత్వానికి అందని బియ్యం
- చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
హుస్నాబాద్, వెలుగు: ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో కొన్న వడ్లను సివిల్ సప్లై ద్వారా సర్కారు మిల్లింగ్‌కు ఇస్తుండగా.. వడ్లను గడువులోగా మిల్లు ఆడించి ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై గోడౌన్లకు తరలించకుండా ఇతర జిల్లాల్లోని మిల్లులకు తరలించి ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారు. ఇదే విషయమై సోమవారం రాత్రి హుస్నాబాద్ మండలం పందిల్లలోని పవనసుత పారాబాయిల్డ్ మిల్లులో విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రభాకర్, ఎఫ్‌సీఐ మేనేజర్ లక్ష్మారెడ్డి, ఎస్సైలు కృష్ణ, జగ్గయ్య ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.
గతేడాది ఇక్కడి ఏఆర్ఎం ఆగ్రోస్ ఇండస్ట్రీస్ యజమాని 9,523 మెట్రిక్ టన్నుల వడ్లను మాయం చేసినట్టు తేలినా ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న ఇతర మిల్లర్లు బియ్యాన్ని ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఏఆర్ఎం మిల్లుకు ప్రభుత్వం 2021లో వానాకాలం, యాసంగి సీజన్‌కు 11,427 మెట్రిక్ టన్నుల వడ్లను కేటాయించింది.
అయితే 2 వేల మెట్రిక్ టన్నుల వడ్లను మాత్రమే బియ్యంగా మరాడించి సీఎంఆర్ కింద పౌర సరఫరాల సంస్థకు అప్పగించింది. మిగితా 9,523 మెట్రిక్ టన్నుల వడ్లను బియ్యంగా చేసి బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్టు తేలింది. దీని విలువ రూ.27.76 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అయినా ఇప్పటి వరకు రికవరీ చేయలేదు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మిల్లర్లు రూ.కోట్ల ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మిల్లులకు ఇచ్చిన వడ్ల లెక్కలు ఒడవడం లేదు.
సీఎంఆర్ ఆలస్యంతో తనిఖీలు చేపడుతున్న అధికారులకు పూర్తి స్థాయిలో వడ్ల లెక్కలు తేలడం లేదు. గత మూడు సీజన్ల నుంచి సీఎంఆర్ లెక్కలు తేలకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో ఏజెంట్లను పెట్టుకొని పీడీఎస్ బియ్యాన్ని కొంటూ, వాటిని పాలిష్ చేసి ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై గోడౌన్లకు తరలిస్తున్నారు. ఇదే బియ్యం మళ్లీ గ్రామాల్లో రేషన్ దుకాణాలకు చేరుకుంటున్నట్టు ఆఫీసర్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వల్ల, నిల్వ ఉన్న వడ్లకు, సీఎంఆర్‍కింద ఇచ్చిన బియ్యానికి లెక్క తేలడం లేదు.
స్టాకు లేకున్నా ఉన్నట్టు మోసం
రైతుల నుంచి వడ్లు కొన్న మిల్లర్లు మరాడించకుండా తమ వద్దే ఉంచుకుంటున్నారు. ధర పెరిగేదాకా ఉంచుకొని డిమాండ్ వచ్చాకా ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి అటు బియ్యం ఇవ్వకుండా మోసం చేయడమేకాకుండా మిల్లుల్లో స్టాకు లేకున్నా ఉన్నట్టు చూపిస్తున్నారు. రెవెన్యూ, సివిల్‌సప్లయ్, విజిలెన్స్‌అధికారులకు అమ్యామ్యాలు ముట్ట జెప్పడంతో రికవరీ సరిగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మిల్లర్లు స్టాకు వివరాలు చెప్పకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని చీటింగ్ చేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మిల్లుల్లో తనిఖీలు చేస్తే వాస్తవాలు బయటపడతాయి.