సూర్యాపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలు, మీడియా సహకరించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే కోరారు. బుధవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మీడియాతో మాట్లాడారు. కోడ్ అమలులో భాగంగా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు రూ. 2 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి సీజ్ చేశామని, ఆధారాలు ఉన్న వాటిని వెంటనే రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.
ఇంటర్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ సరిహద్దుల్లో అధికారులతో సమావేశం నిర్వహించి కోడ్ అమలుకు తీసుకోవాల్సిన అంశాల చర్చించామన్నారు. ఇప్పటికే చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎఫ్ ఎస్‌టీ, ఎస్ఎస్‌టీ టీములు ద్వారా నిరంతరం నిఘా పెట్టామని చెప్పారు. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాత సమాచారాన్ని కొత్తగా చూపించొద్దని, వ్యక్తులు, వ్యవస్థలను కించపరిచేలా పోస్టులు పెద్దవద్దని, సోషల్ మీడియాలో పోస్టులకు గ్రూపు అడ్మిన్‌లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అధ్యక్షతన మీడియా సెంటర్ నడుస్తోందని, పెయిడ్ ఆర్టికల్స్‌పై నిఘా పెట్టామని చెప్పారు. ఏదైనా సమాచారాన్ని ప్రచురణ, ప్రసారం చేయాల్సి వస్తే సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు, సూర్యాపేట డీఎస్పీ గొల్లూరి రవి, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.