వనపర్తి, వెలుగు: వనపర్తి మండలం నాగవరం ఎస్టీ గర్ల్స్ హాస్టల్ నుంచి వనపర్తి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ వరకు ఫ్రీ ఆర్టీసీ బస్ సర్వీస్ ను గురువారం జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి ప్రారంభించారు. గతేడాది నాగవరంలో న్యూ బిల్డింగ్ లోకి ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ను మార్చడంతో అక్కడి నుంచి బాలికలు మూడు కిలోమీటర్లు వనపర్తి టౌన్ లోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ కు కాలినడకన వస్తున్నారు. ఈ విషయంపై పాఠశాల హెచ్ఎం మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి ఆర్టీసీ డీఎం తో మాట్లాడి సమస్యను పరిష్కరించమని ఆదేశించారు.
దీంతో ఫ్రీ ఆర్టీసీ బస్సును ఎస్పీ రక్షితకృష్ణ మూర్తి, డీఎం పరమేశ్వరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గర్ల్స్ హైస్కూల్ సిబ్బంది ఎస్పీ, ఆర్టీసీ డీఎం ను ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో జీహెచ్ఎం తారాబాయి, చెన్నపద్మ, వార్డెన్ సత్తన్న, గట్టు స్వామి, ఆర్టీసీ సిబ్బంది యాదయ్య, కేఎస్ శెట్టి, జేవి స్వామి, తిరుపతయ్య పాల్గొన్నారు.