- పోస్టర్లను ఆవిష్కరించిన ఎస్పీ లు
వనపర్తి టౌన్/ పాలమూరు/ గద్వాల , వెలుగు: తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపేందుకు పోలీస్ శాఖ సిటిజన్ క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ సిస్టం ను ప్రవేశ పెట్టిందని వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ , పాలమూరు ఎస్పీ జానకీ, గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయా జిల్లాల పోలీస్ కార్యాలయంలో సిటిజన్ క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీలు మాట్లాడారు. తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోలీస్ శాఖ నూతనంగా క్యూ ఆర్ కోడ్ ను ప్రారంభించిందన్నారు.
ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లు ప్రతి పోలీస్ స్టేషన్ తో పాటు ఎస్పీ, డీఎస్పీ, సీఐ తదితర అన్ని పోలీస్ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిర్యాదు దారులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది స్పందించిన తీరు పై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలియజేయవచ్చన్నారు. దీంతో పాటు ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ , ఈ చాలన్, ట్రాఫిక్ ఉల్లంఘనలు , పాస్ పోర్ట్ ధ్రువీకరణ, తదితర ఐదు అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఉందన్నారు.
అంతేకాకుండా పోలీసుల సేవలకు రేటింగ్ కూడా ఇవ్వవచ్చన్నారు. వనపర్తి జిల్లా ప్రజలు ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర రావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, నరేష్, సీఐ, కృష్ణ, ఏఎస్పీ రాములు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, గిరిబాబు, సీఐలు అప్పయ్య, ఎజాజ్ హైమద్, గాంధీ నాయక్, శివకుమార్, ఆర్ఎస్ఐ లు కృష్ణయ్య, నగేష్, రవి పాల్గొన్నారు.