ఆత్మకూరు పట్టణంలో పందుల దొంగల అరెస్టు : ఎస్పీ రావుల గిరిధర్​

ఆత్మకూరు పట్టణంలో పందుల దొంగల అరెస్టు : ఎస్పీ రావుల గిరిధర్​
  • ఒక బొలేరో, రూ.90 వేలు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం ఎస్పీ రావుల గిరిధర్​

వనపర్తి, వెలుగు :  ఆత్మకూరు పట్టణంలోని పరమేశ్వర స్వామి చెరువు కట్ట దగ్గర ఉన్న పందుల షెడ్డు నుంచి  పందులను దొంగతనం చేసిన  నలుగురిని మంగళవారం  అరెస్టు చేసినట్టు  ఎస్పీ రావుల గిరిధర్  తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా పోలీస్​ ఆఫీసులో  మీడియాతో మాట్లాడారు.   పరమేశ్వర స్వామి చెరువు కట్ట సమీపంలో  చెన్నయ్య అనే వ్యక్తి షెడ్డు వేసుకొని 73 పందులను పెంచుకుంటున్నాడు. గత  నెల 16న  బింగిదొడ్డి అంజి, మాదిరే మహేశ్​,  నందవరం బాలరాజు రెక్కి  నిర్వహించి,  అక్కడ పందులు ఉన్నట్లు ఎరుకలి భీమన్న, కందేనతి సుంకన్నకు సమాచారమిచ్చారు. 17న  వీరంతా కలిసి ఓ బొలెరోలో  షెడ్డు వద్దకు వచ్చి 30 పందులను బొలెరోలో ఎక్కించేందుకు యత్నించారు.

 పందుల అరుపులు విని  కాపలాదారులు ఇద్దరు వెంటబడగా వారిపై సీసాలు, రాళ్లతో దాడిచేసి , సెల్​ఫోన్లను లాక్కొని జూరాల కాల్వలో పడేశారు. అనంతరం పందులను తీసుకొని   బెంగుళూరు కు వెళ్లి రూ.90వేలకు  పందులను అమ్మేశారు.  వీరు గతంలో  జిల్లాలోని పలు ప్రాంతంలో  పందుల దొంగతనం చేశారు. సిద్దప్ప మరో ఇద్దరిని కలుపుకుని బొలెరో లో   అమరచింత మస్తీపూర్​ మరో దొంగతనం కోసం  వస్తుండగా   పోలీసులు తనిఖీ చేయడాన్ని గమనించి,  వాహనాన్ని తిప్పుకుని పారిపోతుండగా  పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.

విచారణలో నేరాన్ని ఒప్పకున్నారని ఎస్పీ తెలిపారు.  అనంతరం   సిద్దు,  ఎరుకలి అంజి,  ఎరకలి నాగరాజు, గద్వాల జిల్లా బింగిదొడ్డికి చెందిన ఎరుకలి అంజిని  అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. వారి నుంచి బొలెరో , రూ.90వేల నగదు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.  సమావేశంలో వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ, ఏఎస్పీ ఉమామహేశ్వరరావు, ఆత్మకూరు సీఐశివకుమార్, ఎస్సై నరేందర్ , అమరచింత ఎస్సై సురేష్ ,పోలీసు సిబ్బంది తదితరులు 
ఉన్నారు.