
వనపర్తి, వెలుగు: జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందికి జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి 10వ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్ లో మూడు రోజుల ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ ఆఫీసర్లు, స్టాఫ్ విధి నిర్వహణలో వినియోగించే ఆయుధాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
వ్యాయామం చేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర రావు, డీసీఆర్బీ ఎస్పీ ఉమామహేశ్వరరావు, సైబర్ క్రైం డీఎస్పీ రత్నం, ఆర్ఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్ పాల్గొన్నారు.
చదువుకుంటేనే భవిష్యత్తు..
పెబ్బేరు: చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, ర్యాష్ డ్రైవింగ్ నియంత్రణపై స్టూడెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ మోసాలు పెరిగాయని, వాటిపై అప్రమత్తంగా ఉంటూ నేరాలపై పేరెంట్స్కు వివరించాలని సూచించారు.
డబ్బులు నష్టపోతే వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలన్నారు. డ్రగ్స్, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పారు. పెబ్బేరు ఎంవీఐ వాసుదేవరావు, ఎస్సై హరిప్రసాద్రెడ్డి, ఎంఈవో జయరాములు పాల్గొన్నారు.